ఒక జాతిని అంతం చేయాలనే ఉద్దేశంతో దాడులు చేస్తే అది మారణహోమంగా పేర్కొంటూ... ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక తీర్పు వెలువరించింది. మయన్మార్ రోహింగ్యా ముస్లింలపై మారణహోమానికి పాల్పడిందని నిర్ధారించింది. ఈ తీర్పుతో బాధితులకు సుదీర్ఘకాలం తర్వాత న్యాయం లభించినట్లయింది. అంతేకాదు.. భవిష్యత్తులో మారణహోమ కేసుల విచారణకు ఈ తీర్పు కీలకంగా మారనుంది.
2017లో మయన్మార్ భద్రతా దళాలు, స్థానిక సాయుధ బృందాలు రోహింగ్యాలపై దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనల్లో కనీసం 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సామూహిక హత్యలు, అత్యాచారాలు, చిత్రహింసలు, గ్రామాల విధ్వంసం వంటి దారుణాలు చోటుచేసుకున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు 10 లక్షలకు పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. తాజాగా ఐసీజే తీర్పు వెలువడటంతో అక్కడి శిబిరాల్లోని బాధితులు టీవీ తెరల ముందు గుమిగూడి ఆనందం వ్యక్తం చేశారు.
గాంబియా దాఖలు చేసిన కేసు
రోహింగ్యాలపై దాడులకు సంబంధించి 2019లో గాంబియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇస్లామిక్ సహకార సంస్థ మద్దతుతో మయన్మార్‌పై మారణహోమం ఆరోపణలు చేసింది. విచారణలో సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం 9–6 మెజారిటీతో తీర్పు వెలువరించింది. మారణహోమ నిరోధక 1948 ఒప్పందాన్ని ఉల్లంఘించిన దేశంగా మయన్మార్‌ను నిర్ధారించింది.
ఉద్దేశాన్ని నిరూపించడం కీలకం
మారణహోమ కేసుల్లో నేరానికి సంబంధించిన ఉద్దేశాన్ని నిరూపించడం అత్యంత కీలకమైన అంశం. కేవలం హత్యలు, అత్యాచారాలు, విధ్వంసం జరిగినట్లు ఆధారాలు చూపితే సరిపోదు. ఒక జాతి, మతం లేదా నిర్దిష్ట సమూహాన్ని పూర్తిగా లేదా కొంతవరకు అంతం చేయాలనే ఉద్దేశం ఉందని నిరూపించాలి. ప్రభుత్వ పత్రాలు, సైనిక ఆదేశాలు లభించకపోయినా.. దాడుల తీరు, జరిగిన ఘటనల సమగ్రత ఆధారంగా మారణహోమ ఉద్దేశాన్ని నిర్ధారించవచ్చని ఐసీజే స్పష్టం చేసింది.
గాజా కేసుపైనా ప్రభావం!
మయన్మార్ కేసులో వెలువడిన తీర్పు గాజాలో ఇజ్రాయెల్ చర్యలకు సంబంధించి దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసుపైనా ప్రభావం చూపనుంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజాలో మారణహోమానికి పాల్పడిందని దక్షిణాఫ్రికా ఆరోపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. మయన్మార్ కేసులో మారణహోమాన్ని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాల ప్రమాణాలను స్పష్టం చేయడంతో.. గాజా కేసులోనూ విచారణకు కీలక మార్గదర్శకత్వం లభించవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ తీర్పుతో రోహింగ్యాలకు తక్షణ ఉపశమనం లభించే పరిస్థితి లేదు. వందలాది గ్రామాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. బాధితులకు పరిహారం చెల్లించాలని మయన్మార్‌ను ఐసీజే ఆదేశించినప్పటికీ.. తీర్పులను అమలు చేసే ప్రత్యక్ష యంత్రాంగం న్యాయస్థానానికి లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మయన్మార్‌పై కఠిన చర్యలు తీసుకునే తీర్మానాలకు చైనా, రష్యా అడ్డుపడే అవకాశాలున్నాయి. అయినప్పటికీ పౌరులపై దాడులు, మారణహోమాలకు పాల్పడితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం బాధ్యత తప్పదనే బలమైన సందేశాన్ని ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: 13 ఏళ్లుగా భార్యపై భర్త అఘాయిత్యం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!


