అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. చైనాలోని షెన్‌జెన్‌లో జరిగిన ఈ భేటీలో అంతర్జాతీయ భద్రత, అణ్వాయుధాల నియంత్రణ, ఇంధన సరఫరా వంటి పలు కీలక అంశాలపై ఈ ముగ్గురూ చర్చించారు. అందులో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై ముగ్గురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలో వ్యూహాత్మక స్థిరత్వం, అంతర్జాతీయ భద్రతను కాపాడేందుకు అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం నాలుగు కీలక అంశాలతో ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
నాలుగు కీలక నిర్ణయాలు:
1. ఐరాస సంస్కరణలు: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న అమెరికా, చైనా, రష్యా.. ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని అంగీకరించాయి. అంతర్జాతీయ శాంతి, భద్రత పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాయి.
2. చమురు సరఫరా: శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల తయారీ, సరఫరాను పెంచడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఇంధన సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని అంగీకరించాయి.
3. అంతర్జాతీయ న్యాయస్థానం: దేశాల సార్వభౌమత్వం, ప్రభుత్వ అధికారులకు కల్పించే రక్షణలను గౌరవించాలని.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికార పరిధిని దుర్వినియోగం చేయకూడదని పేర్కొన్నాయి.
4. అణ్వాయుధాల నియంత్రణ: అణుయుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని, అలాంటి యుద్ధం ఎప్పటికీ జరగకూడదని నేతలు స్పష్టం చేశారు. అణ్వాయుధ ముప్పును తగ్గించడం, వాటి విస్తరణను అడ్డుకోవడంపై చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు.


