భార్యకు మత్తుమందు ఇచ్చి, ఆమెకు తెలియకుండా ఇంటర్నెట్‌లో ఇతర పురుషులతో లైంగిక సంబంధాల కోసం ప్రకటనలు పెట్టి దాడులు చేయించిన భర్త దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు పురుషులను బ్రిటన్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. యూకేలో ఇలాంటి కేసులో జ్యూరీ విచారణ ద్వారా దోషులుగా తేలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
విల్ట్‌షైర్‌లోని స్విండన్‌కు చెందిన ఫిలిప్ యంగ్ (50) తన భార్య జోవాన్ యంగ్‌కు 13 ఏళ్ల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ఆమెకు తెలియకుండా ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ఇతర పురుషులను ఇంటికి ఆహ్వానించి లైంగిక దాడులకు పాల్పడేలా చేశాడు. ఈ వ్యవహారంలో నార్మన్ మాక్సోని (48), రిచర్డ్ విల్కిన్స్ (62), కానర్ శాండర్సన్-డాయిల్ (32), మహమ్మద్ హసన్ (38)లను కోర్టు దోషులుగా తేల్చింది.
విచారణలో విల్కిన్స్, మాక్సోని ఒక్కొక్కరు అత్యాచారం కేసులో దోషులుగా తేలారు. శాండర్సన్-డాయిల్ లైంగిక వేధింపులు, లైంగిక దాడికి పాల్పడినట్లు, విల్కిన్స్ లైంగిక దాడికి పాల్పడినట్లు, హసన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జ్యూరీ నిర్ధారించింది. మరో నిందితుడు డీన్ హామిల్టన్ గత ఫిబ్రవరిలోనే అత్యాచారం సహా పలు నేరాలను అంగీకరించాడు.
ఈ ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని జోవాన్ యంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత నమ్మిన వ్యక్తే తనకు ఊహించని రీతిలో ద్రోహం చేశాడని, దీని ప్రభావం తనతో పాటు పిల్లల జీవితాలపైనా తీవ్రంగా పడిందని తెలిపారు. తనపై జరిగిన దారుణంలో ఇతరులు కూడా భాగస్వాములయ్యారని, వారు స్వచ్ఛందంగా ఆ నేరాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పు బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందనే భరోసా ఇస్తుందని అన్నారు.
అలాగే ఈ కేసులో బాధితురాలు చూపిన ధైర్యాన్ని న్యాయమూర్తి ప్రశంసించారు. దోషులకు డిసెంబర్ 21, 22 తేదీల్లో శిక్షలు ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ తరహా మత్తుమందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడే ఘటనలు బయటపడటం కష్టమని పోలీసులు పేర్కొన్నారు. బాధితులకు జరిగిన విషయం తెలియకపోవడం, జ్ఞాపకాలు పూర్తిగా లేకపోవడం, మద్యం ప్రభావంగా భావించడం వంటి కారణాలతో ఫిర్యాదులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ కేసులో మరో వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎప్‌స్టీన్ గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు : తాజా నివేదిక సంచలనం


