సివిల్స్–2025 అభ్యర్థుల సర్వీసు కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్
ఓబీసీ క్రీమీలేయర్ తీర్పుపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత
కొత్త నిబంధనల రూపకల్పనకు కేంద్రానికి 8 వారాల గడువు
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) క్రీమీలేయర్ నిర్ధారణ విషయంలో ఈ ఏడాది మార్చి 11న ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఆ తీర్పును పాత తేదీ నుంచి (రెట్రోస్పెక్టివ్‌గా) కాకుండా, ముందస్తుగానే (ప్రాస్పెక్టివ్‌గా) అమలు చేయాలని వివరించింది. దీని ఆధారంగా గతంలో జరిగిన నియామకాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్ల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి సమీక్షించబోమని స్పష్టం చేసింది. తీర్పు అమలుకు తగు చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి మరో 8 వారాల గడువు ఇస్తున్నామంది. తీర్పు అమలు విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
తల్లిదండ్రుల వేతనం, ఉద్యోగ హోదా కూడా..
ఓబీసీ క్రీమీలేయర్ నిర్ధారణలో అభ్యర్థి తల్లిదండ్రుల వేతనంతోపాటు, వారు చేసే ఉద్యోగ హోదాను సైతం పరిగణనలోకి తీసుకోవాలని మార్చి 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు అమలు విషయంలో తలెత్తుతున్న క్షేత్రస్థాయి ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పును సమీక్షించాలని కోరడం లేదని, కానీ అమలు కాలవ్యవధిపై స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. తీర్పు కేవలం కోర్టు ముందున్న పక్షాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే పూర్తయిన ఎంపిక ప్రక్రియలు, సర్వీస్, క్యాడర్ కేటాయింపులు, సీనియారిటీలు నాటి నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులను మాత్రం ఆయా కోర్టులు మెరిట్ ఆధారంగా పరిష్కరిస్తాయని వెల్లడించింది.
కేంద్రం ఆందోళన.. కీలక గణాంకాలు..
మార్చి 11వ తేదీనాటి తీర్పును పాత తేదీ నుంచి అమలు చేస్తే ఎదురయ్యే పరిణామాలను, కీలక గణాంకాలను వెల్లడిస్తూ కేంద్రం ‘2016– 2025 మధ్య కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల పరిధిలో మొత్తం 5.69 లక్షల రిజర్వ్‌డ్ ఖాళీలను భర్తీ చేశారు. అందులో 3.70 లక్షల ఓబీసీ పోస్టులు ఉన్నాయి. 1993 ఆగస్టు 8వ తేదీ నాటి ఆఫీస్ మెమోరాండం, తదనంతర మార్గదర్శకాల ప్రకారమే ఈ నియామకాలు జరిగాయి. దీన్ని వెనకటి తేదీ నుంచి వర్తింపజేస్తే 2012 నుంచి జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ (సీఎస్‌ఈ) సర్వీసు కేటాయింపులను సైతం సమూలంగా సమీక్షించాల్సి వస్తుంది.
ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1993 నాటి పాత విధానాన్నే అనుసరిస్తున్నాయి. ఉన్నత విద్యాసంస్థల్లో 2012 నుంచి లక్షలాది ఓబీసీ అడ్మిషన్లు జరిగాయి. పాత తేదీల నుంచి తీర్పును అమలు చేస్తే ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోతాయి. అడ్మిషన్లలో సూపర్‌న్యూమరరీ సీట్లు లేనందున గందరగోళం తలెత్తుతుంది. సాంకేతిక సర్వీసులకు ఎంపికైన వారి ఫిజికల్, మెడికల్ ప్రమాణాలను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పరిశీలించడం సైతం సాధ్యం కాదు’అని తెలిపింది.
958 మంది సివిల్స్ అభ్యర్థులకు ఊరట
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2025లో ఎంపికైన 958 మంది అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపు కోసం కేంద్రం విడిగా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌కు సైతం సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. 1993 నాటి మెమోరాండం ప్రకారమే వీరికి సర్వీసులు కేటాయించేందుకు అనుమతించింది. ఈ కేటాయింపులు ఆలస్యమైతే అభ్యర్థుల ఫౌండేషన్ కోర్సు, వార్షిక శిక్షణ వాయిదా పడే ప్రమాదం ఉందని కేంద్రం కోర్టుకు విన్నవించడంతో ఈ మేరకు వెసులుబాటు లభించింది.
మార్చి 11 తీర్పులో ఏముందంటే...: కేంద్రం 1993లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం (ఓఎం) ప్రకారం.. క్రీమీలేయర్ నిర్ధారణకు కేవలం వేతనాన్ని ప్రాతిపదికగా తీసుకోరాదని, ఆదాయ/సంపద పరీక్ష వర్తించే చోట వేతనం, వ్యవసాయ ఆదాయాలను మినహాయించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు మార్చి 11న స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలతో సమానమైన పోస్టుల గుర్తింపు జరగని ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూలు), బ్యాంకులు, వర్సిటీలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల పిల్లల విషయంలో తల్లిదండ్రుల వేతనాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటూ 2004 అక్టోబర్ 14న ఇచ్చిన వివరణను కోర్టు తప్పుబట్టింది. పీఎస్‌యూ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల పిల్లల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లకు విరుద్ధమని నాడు తీర్పునిచ్చింది.
సమానత్వ నిర్ధారణకు గడువు పెంపు
ప్రభుత్వ పోస్టులతో సమానంగా ఇతర సంస్థల్లోని (పీఎస్‌యూలు, బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు) పోస్టుల సమానత్వాన్ని (ఈక్వివలెన్స్) నిర్ధారించడానికి, క్రీమీలేయర్ హోదాను నిర్ణయించేందుకు ఉమ్మడి యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉందని కేంద్రం తెలిపింది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున ఇందుకు రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరింది. స్పందించిన ధర్మాసనం.. తీర్పును అమలు చేసేందుకు ప్రస్తుతానికి ఎనిమిది వారాల గడువును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


