అప్పుడే బాధ్యత తెలుస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్య
పంజాబ్ ప్రధాన కార్యదర్శిపై కేసు కొట్టివేత
ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ బకాయిలపై వివాదం
ధిక్కరణ కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిలోనే రావాలి. అప్పుడే వారు బాధ్యతగా వ్యవహరిస్తారు’’అని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది.
ఇందులో ఒక పిటిషన్ పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించినది. ఈ కేసులో హైకోర్టు పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఏ.పీ సిన్హాపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ బకాయిలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన మరో ఆదేశాన్ని సవాలు చేస్తూ ఇంకో రెండు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
మూడింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పంజాబ్ ప్రధాన కార్యదర్శి సహా పలువురు అధికారులపై క్రిమినల్ ధిక్కార చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ కేసు విచారణను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత హాజరుపై ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనూ కొట్టివేసింది. పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తేనే వారికి నిజమైన బాధ్యత ఉంటుంది’’అని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న ప్రభుత్వం దాదాపు రూ.13,000 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందిందని రాష్ట్రం తరఫు న్యాయవాది బెంచ్ దృష్టికి తీసుకురాగా.. వచ్చే ఏడాది మార్చిలోగా ఎంత మొత్తం విడుదల చేయగలరో తెలపాలని కోరింది. ‘‘మీకు కొంత వెసలుబాటు ఇస్తున్నాం. సానుకూలంగా స్పందించండి’’అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను డిసెంబరు ఒకటవ తేదీకి వాయిదా వేసింది. ఆగస్టు మూడవ తేదీన హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పిటిషనర్లుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఇలా మొదలైంది...
పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరవు భత్యం (డీఏ) బకాయిల వివాదం ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్–హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కీలక మలుపు తిరిగింది. డీఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం సూచించిన ప్రణాళికను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తిరస్కరించింది. జూన్ 30లోపు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు వర్తించే రేట్ల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ విడుదల చేయాలని ఆదేశించింది. పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఆదేశాలను డివిజన్ బెంచ్ ముందు సవాలు చేశాయి. డివిజన్ బెంచ్ ఆగస్టు 3న ప్రభుత్వం అప్పీళ్లను కొట్టివేసింది.
రెండు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు పత్రికలు, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో భారీ ప్రకటనలపై ఖర్చులు చేయవద్దని కూడా స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు అమలు కాలేదని ఉద్యోగులు, పెన్షనర్లు కొందరు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అక్టోబర్ 12న, ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హాకు నోటీసు జారీ చేసింది. క్రిమినల్ ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సివిల్ ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు క్రిమినల్ కాంటెంప్ట్ చర్యలు ప్రారంభించడం సరికాదని వాదించారు.


