డిసెంబర్‌లో స్వదేశానికి! | Bangladesh ousted premier Hasina says she will return from exile in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో స్వదేశానికి!

Nov 6 2026 6:24 AM | Updated on Nov 6 2026 6:24 AM

Bangladesh ousted premier Hasina says she will return from exile in December

బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా వెల్లడి 

ఎవరి సాయమూ కోరనని స్పషీ్టకరణ

ఢాకా: ఏది ఏమైనప్పటికీ డిసెంబర్‌లో స్వదేశానికి రావడం ఖాయమని బంగ్లాదేశ్‌ పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా పునరుద్ఘాటించారు. 2024లో జరిగిన నిరసనలతో షేక్‌ హసీనా స్వదేశాన్ని వీడి భారత్‌ చేరారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. తన ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై జరిగిన అణచివేతలకుగాను ఆమె మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. 

ట్రిబ్యునల్‌ తనకు మరణ శిక్ష విధించడాన్ని తిరస్కరించడంతోపాటు విచారణ చట్టబద్ధతను సైతం హసీనా సవాల్‌ చేస్తున్నారు. డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి రానున్నట్లు ఆమె ఆగస్ట్‌లోనే ప్రకటించారు. వచ్చే నెలలో భారత్‌లో ప్రవాసం వీడి బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి కట్టుబడి ఉన్నానని ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’తాజాగా ఈ మెయిల్‌ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

‘నేను మరణించాల్సి ఉంటే, నా సొంత నేలపై, నా సొంత ప్రజల మధ్యే చావడానికి ఇష్టపడతా. అందుకే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు’అని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘తిరిగి వస్తే అరెస్ట్‌ చేస్తారని నాకు తెలుసు. జైల్లో పెట్టవచ్చు, హింసించవచ్చు చంపనూ వచ్చు. అందుకు అవకాశముందనీ నాకు బాగా తెలుసు. కానీ, నా ప్రజలు బాధపడుతుండటాన్ని చూస్తూ నేను దూరంగా ఉండి నా జీవితాన్ని గడపలేను’అని ఆమె అన్నారు. 

బంగ్లాదేశ్‌కు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు భారత్, అమెరికా లేదా మరే ఇతర దేశం సాయాన్నీ కోరుకోవడం లేదని ఆమె వివరించారు. సొంత దేశానికి తిరిగి వెళ్లడానికి తనకు ఎవరి ఆశీస్సులూ అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు ఎలా రావాలనుకుంటున్నదీ ఆమె వెల్లడించలేదు. ‘అధికారం కోల్పోయిన తర్వాత 2024 ఆగస్ట్‌ నుంచి మా పార్టీ కార్యకర్తలు సుమారు 20 వేల మంది హత్యకు గురయ్యారు. 

దాదాపు అంతే సంఖ్యలో నిర్బంధానికి గురయ్యారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ మద్దతుదారులు ఇళ్లు, వ్యాపారాలు, ఉపాధిని కూడా కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో నేడు ఎలాంటి సాధారణ రాజకీయ, ప్రజాస్వామ్య వాతావరణం ఎంతమాత్రమూ లేదు‘ అని ఆమె పేర్కొన్నారు. బంగ్లా ప్రభుత్వం తన పార్టీని పథకం ప్రకారం అణచివేస్తోందని విమర్శించారు. హసీనా పదవీచ్యుతులైన తర్వాత, నోబెల్‌ గ్రహీత మహ్మద్‌ యూనస్‌ తాత్కాలిక పాలనా బాధ్యతల్లో ఏడాదిన్నరపాటు కొనసాగారు. 2026 ఫిబ్రవరిలో హసీనా చిరకాల ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్‌ రెహ్మాన్‌ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టారు. 

ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధించారు. పార్టీ తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్న తరుణంలో హసీనా తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉన్నారు. పార్టీపై నిషేధం కొనసాగుతుండగా, సీనియర్‌ నాయకులు అరెస్టవడమో లేదా ప్రవాసంలోకి వెళ్లడమో జరిగింది. కొన్ని నెలలుగా పౌర, రాజకీయ హక్కులపై రెహమాన్‌ ప్రభుత్వం జరుపుతున్న దాడులను హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌తో సహా పలు హక్కుల సంఘాలు విమర్శించా యి. అయితే, ఈ అరెస్టులు నిర్దిష్టమైన ఆరోపణల ఆధారంగానే జరుగుతున్నాయని ప్ర భుత్వం చెబుతోంది. 2009–2024 మధ్య కా లంలో హసీనా ప్రధానిగా వ్యవహరించారు. చివరి నెలల్లో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో 1,400 మంది వరకు చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement