ఇయర్‌ ఎండింగ్‌ ధమాకా | Upcoming Movies Releasing in December 2026: Tollywood | Sakshi
Sakshi News home page

ఇయర్‌ ఎండింగ్‌ ధమాకా

Nov 4 2026 3:40 AM | Updated on Nov 4 2026 3:40 AM

Upcoming Movies Releasing in December 2026: Tollywood

డిసెంబరు పోరులో సీనియర్లతో పాటు యంగ్‌ హీరోల జోరు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్‌లో తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. సీనియర్, స్టార్‌ హీరోల నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి బరిలో నిలిచేందుకు సన్నద్ధం అవుతుంటారు. సంక్రాంతి తర్వాత వేసవితో పాటు దసరా, దీపావళి వంటి పండగల సమయంలోనూ పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. అయితే ఈ ఏడాదిలో ఆఖరు నెల డిసెంబరులోనూ బాక్సాఫీస్‌ వద్ద భారీ రసవత్తర పోరుకు రంగం సిద్ధం అయింది.

నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్‌ హీరోలతో పాటు నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ, నితిన్, విశ్వక్‌ సేన్, కిరణ్‌ అబ్బవరం, ప్రియదర్శి వంటి యువ కథానాయకులు డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు విడుదల తేదీలను ఖరారు చేసుకోగా, మరికొన్ని రిలీజ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేసుకోనప్పటికీ లైనప్‌లో ఉన్నాయి. ‘ఇయర్‌ ఎండింగ్‌ ధమాకా’లా డిసెంబరు నెల సినిమా ప్రియులకు పండగ వాతావరణాన్ని తీసుకురానుంది. మరి... డిసెంబరు పోరుకు సిద్ధం అవుతున్న ఆయా హీరోలు ఎవరు? సినిమాలేంటి? వంటి వివరాలు చూద్దాం...  

4న వృషకర్మ
‘తండేల్‌’ (2025) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ మూవీ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. శ్రీవాస్తవ విలన్‌ పాత్ర పోషించిన ఈ మూవీలో జయరామ్, బేబీ కియారా ఇతర పాత్రలు పోషించారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ .బి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 4న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘నాగచైతన్య నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’. విభిన్నమైన నేపథ్యంలో రూపొందించిన మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ఇది. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీలో తన సాహసోపేతమైన పాత్రకు తగినట్లుగా నాగచైతన్య పూర్తిగా కొత్త లుక్‌లోకి మారారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక ప్రీ–రిలీజ్‌ బిజినెస్‌ను కూడా సాధించింది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్‌ వర్గాల్లోనూ ‘వృషకర్మ’పై పాజిటివ్‌ బజ్‌ నెలకొంది.

ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్‌ కంటెంట్‌తో మా చిత్రంపై అంచనాలు పెరిగాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఇషాక్‌ సక్సేనా, అశోక్‌ బండ్రెడ్డి, సంగీతం: అజనీష్‌ బి. లోక్‌నాథ్, కెమెరా: రాగుల్‌ డి. హెరియన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నరసింహ చారి చెన్నోజు.  

4న అలియాస్‌ రుక్మిణి  
నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్‌ రుక్మిణి’. ‘దండోరా’ మూవీ ఫేమ్‌ మురళీకాంత్‌ దేవసోత్‌ రచన, దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సాయి కుమార్, హర్ష వర్ధన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో నాని సమర్పణలో యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా డిసెంబరు మొదటి వారంలోనే 4న ఆడియన్స్‌ ముందుకు వస్తోంది. ‘‘కోర్ట్‌–స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో నాని–యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ ‘అలియాస్‌ రుక్మిణి’ వంటి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది.

ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ‘అలియాస్‌ రుక్మిణి’ సినిమా ఉంటుంది. ఈ మూవీలో నితిన్‌ యునిక్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ప్రేమ, హాస్యం కలగలిసిన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించాం. అందులో భాగంగా ‘రుక్కు రుక్కు రుక్మిణి’ అంటూ సాగే ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. అదే విధంగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ ద్వారా నితిన్‌ పాత్రను పరిచయం చేయగా చక్కని స్పందన వచ్చింది.

విభిన్నమైన హాస్యం, ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌తో ఆ గ్లింప్స్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ప్రత్యేక గ్లింప్స్‌ ద్వారా హీరోయిన్‌ ఆఫియా సయ్యద్‌ను పరిచయం చేయగా హ్యూజ్‌ రెస్పాన్స్‌ అందుకుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ సినిమాకి కెమెరా: జోమోన్‌ టి. జాన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ప్రశాంత్‌ మండవ.  

4న లెగసీ 
విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెగసీ’. ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్‌ రెడ్డి దైదా తెరకెక్కిస్తున్న ద్వితీయ చిత్రం ఇది. ఏక్తా రాథోడ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రావు రమేష్, సచిన్‌ ఖేడేకర్, మురళీ మోహన్, ఏక్తా రాథోడ్, రాజా రవీంద్ర, రాజీవ్‌ కనకాల, అనీష్‌ కురువిళ్ల, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్‌ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కలాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్‌ దగ్గుమాటి, సాయి కిరణ్‌ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ ‘లెగసీ’ కూడా 4నే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది.

‘‘ఇంటెన్స్‌ పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘లెగసీ’. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నాం. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణం నేపథ్యంలో విశ్వక్‌ సేన్‌ పాత్ర సాగుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటుడు కేకే మీనన్‌ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

పవర్‌ఫుల్‌ కథాంశం, విశ్వక్‌ సేన్‌ ఇంటెన్స్‌ రోల్, భారీ తారాగణం, ప్రతిభావంతమైన సాంకేతిక బృందంతో రూపొందుతున్న ‘లెగసీ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్నీ, సంగీతం: గోవింద్‌ వసంత, సహ నిర్మాతలు: సంజయ్‌ సాంబ్రాణి, వి.వి.ఎన్‌. ప్రసాద్‌.  

11న ఇడుపు కాయితం 
ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. ఈ సినిమాలో ఫోక్‌ సాంగ్స్‌ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్‌గా నటించారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో బన్నీ వాస్‌ వర్క్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బన్నీ వాస్, సుకుమార్‌ నిర్మించిన ఈ మూవీ డిసెంబరు 2వ వారంలో 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీతో ఎంటర్‌టైనింగ్‌ డ్రామాగా ‘ఇడుపు కాయితం’ రూపొందింది.ప్యాషన్‌ ఉన్న యంగ్‌ టీమ్‌ అంతా మా మూవీకి హార్డ్‌ వర్క్‌ చేశారు. కొత్తగా పెళ్లయిన ఇంట్లో ఏం జరుగుతుంది? ఒక నీటి పంపు దగ్గర ఏం జరుగుతుంది? ఇలా మన ఇంటి కథ చెప్పినట్లు అనిపించింది. కథ విన్న వింటనే సినిమా కథలా లేదు మన ఇంట్లో జరిగే కథలా ఉంది అని చె΄్పాను.

ఈ సినిమా కథ, మాటలు, నేపథ్యంలోని సహజత్వమే అందర్నీ ఆకట్టుకుంటుంది. కొత్త జంటలు మీ అత్తా మామలను తీసుకుని మా సినిమా చూసేందుకు రండి. థియేటర్‌ నుంచి బయటకు వెళేట్లప్పుడు వాళ్లు మీ భుజాలపై చేయి వేసి తీసుకెళ్తారు. పెళ్లైన కొత్తలో మా ‘ఇడుపు కాయితం’ సినిమా చూస్తే మీరు ఇంకెప్పుడూ ఇడుపు కాయితం గురించి ఆలోచించరు’’ అని నిర్మాత బన్నీ వాస్‌ పేర్కొన్నారు. శివజ్యోతి, సుజాత, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎంఎన్‌ బాల్‌ రెడ్డి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి.  

24న కింగ్‌ 100 
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. తన కెరీర్‌లో 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌ 100’. ఈ సినిమాకి తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 24న విడుదల కానుంది. ‘‘యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న సినిమా ‘కింగ్‌ 100’. నాగార్జున కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు కార్తీక్‌. నాగార్జున నూరవ చిత్రం కావడంతో ఇటు ఇండస్ట్రీలో అటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా నాగార్జున–టబు కాంబినేషన్‌లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అదే విధంగా ‘సిసింద్రి’ సినిమాలోనూ వీరిద్దరూ ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కింగ్‌ 100’ మూవీ కోసం వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున, టబు కలిసి నటిస్తుండటం ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. నేడు టబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె స్పెషల్‌ గ్లింప్స్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది.  

24న దాదా...  
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దాదా’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీర సింహారెడ్డి’ (2023) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఇది. మంచు మనోజ్, కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 24న రిలీజ్‌ కానుంది. ‘‘ముంబయ్‌ నేపథ్యంలో సాగే స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘దాదా’. ఈ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: అరవింద్‌ ఎస్‌. కశ్యప్‌.  

25న రియాలిటీ 
కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. ఈ సినిమాలో దేవిక భట్‌ కథానాయికగా నటిస్తుండగా, శరత్‌ కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాయ్‌ ఫిల్మ్స్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 25న విడుదల కానుంది. ‘‘నిత్య జీవితంలోని సహజమైన భావోద్వేగాలు, మన చుట్టూ ఉండే చిన్న చిన్న ఆనందాలను ‘రియాలిటీ’ చిత్రం ద్వారా అందంగా ప్రజెంట్‌ చేయనున్నారు కిరణ్‌. ‘క’, ‘కె–ర్యాంప్‌’ చిత్రాల విజయాలతో జోరు మీదున్న ఆయన ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తొలి పాటగా విడుదల చేసిన ‘భజ గోవిందం’ ఫుల్‌ వీడియో సాంగ్‌కి మంచి స్పందన లభించింది. ‘రియాలిటీ’ జీవితానికి ఆంథమ్‌లా నిలిచే ఈ పాట జీవితంలోని చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలనే సినిమా ప్రధాన సందేశాన్ని అందంగా ఆవిష్కరించింది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సురేష్‌ యెర్రా, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌.  

⇒ విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియన్‌ మూవీ ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్‌ రవి కిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా డిసెంబర్‌ బరిలో నిలవనుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ ప్రకటించినప్పటికీ విడుదల తేదీ ఎప్పుడనే విషయాన్ని మాత్రం ఇంకా అనౌన్స్‌ చేయలేదు. ‘‘విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందుతోంది. అక్టోబరు 17న కీర్తీ సురేశ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ‘రౌడీ జనార్థన’ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన స్పెషల్‌ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసేందుకు విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ వేచి చేస్తున్నారు’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌ సి చంద్రన్‌.  

అనువాద చిత్రాలు కూడా... 
డిసెంబరు నెలలో పలు డబ్బింగ్‌ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పలు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌ మూవీస్‌ టాలీవుడ్‌ ఆడియన్స్‌ని పలకరించనున్నాయి. విజయ్‌ సేతుపతి హీరోగా మిస్కిన్‌ దర్శకత్వ వహించిన ‘ట్రైన్‌’ సినిమా డిసెంబరు 4న విడుదలవుతోంది. అదేవిధంగా బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపికా పదుకోన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్ మెంట్, మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ పతాకాలపై గౌరీఖాన్ , మమతా ఆనంద్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న రిలీజ్‌ కానుంది. హాలీవుడ్‌ ఫిల్మ్స్‌ ‘అవెంజర్స్‌ డూడ్స్‌ డే’ మూవీ డిసెంబరు 17న, ‘డ్యూన్‌: పార్ట్‌ 3’ 18న, ‘జుమాంజి ఓపెన్‌ వరల్డ్‌’ 25వ తేదీన ఆడియన్స్‌ ముందుకొస్తున్నాయి.  

– డేరంగుల జగన్‌ మోహన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement