ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ | Upcoming movie Update: Some heroines who have played role of police officers | Sakshi
Sakshi News home page

ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ

Nov 4 2026 3:33 AM | Updated on Nov 4 2026 3:34 AM

Upcoming movie Update: Some heroines who have played role of police officers

గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే కాదు... చాన్స్‌ లభించాలే కానీ ఫైట్స్‌ చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేసేది లేదంటున్నారు హీరోయిన్స్‌. ఈ క్రమంలోనే కొందరు కథానాయికలు ఖాకీ డ్రెస్‌ ధరించి, లాఠీ పట్టారు. వెండితెరపై అన్యాయంపై న్యాయంగా పోరాడుతున్నారు. ఇలా ఆఫీసర్స్‌గా డ్యూటీ చేస్తున్న కొందరు హీరోయిన్స్‌పై ఓ లుక్‌ వేయండి.

ఆపరేషన్‌ ఓం 
ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసే ముఠా ఆటకట్టించడానికి ఓ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ ఆరంభించారు నిత్యా రెడ్డి. ఇదే ‘ఆపరేషన్‌ ఓం’. నిజాయతీ, తెలివి, అనుభవం ఉన్న అమ్మాయి నిత్యా రెడ్డి. ఆమె తండ్రి ఓ ఫారెస్ట్‌ ఆఫీసర్‌. మరి... యంగ్‌ ఆఫీసర్‌ నిత్య చేపట్టిన ‘ఆపరేషన్‌ ఓం’ ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 20న రిలీజ్‌ కానున్న ‘ఓం: చాప్టర్‌ 1–ఉధిరం బ్లడ్‌ ఉడ్‌’ చూడాలి. ధనుష్‌ హీరోగా రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటించగా, మమ్ముట్టి, నసీరుద్దీన్‌ షా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నాయుడు పేటకి చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ నిత్యా రెడ్డి పాత్రలో సాయి పల్లవి నటించారు. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె నటించిన తొలి చిత్రం ఇది. 

భయపడే పోలీస్‌ ఆఫీసర్‌!
చిన్న చిన్న విషయాలకే భయపడే ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ప్రపంచాన్నే నాశనం చేయాలనుకునే దుష్టశక్తులను ఎలా ఎదుర్కొంది? ఈ ప్రయాణంలో ఈ పోలీస్‌ ఆఫీసర్‌కు అమ్మవారి నుంచి ఎలాంటి సాయం లభించింది? అన్న అంశాల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘మూకుత్తి అమ్మన్‌ 2’. ఈ సినిమాకు తెలుగులో ‘మహాశక్తి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం (పోలీస్‌ ఆఫీసర్, అమ్మవారు) చేశారు. దునియా విజయ్, రెజీనా నెగటివ్‌ రోల్స్‌ చేశారు. సుందర్‌. సి దర్శకత్వంలో ఇషారి కె. గణేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.  

ది బ్లాక్‌ గోల్డ్‌ 
హీరోయిన్‌ సంయుక్త నటించిన తొలి ఉమెన్‌  సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘ది బ్లాక్‌ గోల్డ్‌’. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సంయుక్త పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించారు. దేశాన్ని కుదిపేసిన కోల్‌ సిండికేట్‌ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా  కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని రిస్కీ యాక్షన్‌ స్టంట్స్‌ చేశారు. కేఎమ్‌సీ యోగేష్‌ దర్శకత్వంలో మాగంటి పిక్చర్స్‌ సహకారంతో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.  

మంగళ గౌరి 
పోలీస్‌గా తొలిసారి ఖాకీ యూనిఫామ్‌ ధరించారు హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌. రాహుల్‌ పీకే దర్శకత్వంలో రుక్మిణీ వసంత్, మాలాశ్రీ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న కన్నడ సినిమా ‘మంగళ గౌరి’. ఈ చిత్రంలో పోలీస్‌ గౌరి పాత్రలో రుక్మిణీ వసంత్, మంగళ పాత్రలో మాలాశ్రీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇద్దరు సాధారణ మహిళలు ఎందుకు ఓ అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది? వారి జీవితంలో ఏం జరిగింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ ‘మంగళ గౌరి’ కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. 
ఇలా పోలీస్‌ ఆఫీసర్లుగా నటిస్తున్న హీరోయిన్స్‌ మరికొంతమంది ఉన్నారు.

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement