source: X
బంగ్లాదేశ్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌లో విండీస్ మిడిలార్డర్ బ్యాటర్ ఆమిర్ జాంగూ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. జాంగూ ఐదో స్థానంలో బరిలోకి దిగి 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో జాంగూకు ఇది రెండో శతకం. ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకపై డబుల్ సెంచరీ బాదిన జాంగూ.. గత నెలలో భారత్‌పై వన్డేలో మెరుపు సెంచరీ చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి విండీస్ స్కోర్ 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులుగా ఉంది. జాంగూ 102, జస్టిన్ గ్రీవ్స్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కెవిన్ విక్హమ్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. బ్రాండన్ కింగ్ 9, జాషువ డిసిల్వ 12, కవెమ్ హాడ్జ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్ తలో 2 వికెట్లు తీశారు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ గెలిచిన విండీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: అర్థశతకాలతో చెలరేగిన బ్యాటర్లు.. కోలుకున్న విండీస్


