ఆజం ఖాన్ (PC: PCB/X)
గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. యాజమాన్యం సహా జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌ల విషయంలో తరచూ మార్పుల వల్ల నిలకడ లేకుండా పోయింది. గత తొమ్మిదేళ్లలో పాక్ ఒకే ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలిచింది.
వరుస టోర్నీలలో పరాజయాలు
వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీల్లో ఘోర పరాజయాలు చవిచూసింది. ఇక ఆసియా కప్ టోర్నీల్లోనూ పాక్ జట్టును ఓటములే పలకరించాయి. అదే విధంగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ టోర్నీలో ఇంత వరకు పాక్ ఫైనల్‌కు చేరువైన దాఖలాలు కూడా లేవు.
లావుగా ఉన్నానని నాపై నిందలు
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సమయంలో తనను అనవసరంగా ఆడిపోసుకున్నారని.. తాను ఆ ఈవెంట్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడానని గుర్తుచేశాడు. అయినప్పటికీ.. లావుగా ఉన్న క్రికెటర్‌ను ఎంపిక చేయడం వల్లే జట్టు ఓడిపోయిందంటూ కొంతమంది విష ప్రచారం చేశారని మండిపడ్డాడు.
ఫిట్‌గా ఉన్న ప్లేయర్లు అదే టోర్నీలో టీమిండియా విధించిన120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డారని.. వారి వల్ల జట్టుకు ఏం ప్రయోజనమని ఆజం ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భారీ కాయాన్ని చూసి హేళన చేయడం తగదని.. ఫిట్‌నెస్‌పై తానూ దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు.
ఒకే ఒక్క మ్యాచ్ ఆడాను డ్యూడ్
ఈ మేరకు బ్యాక్‌వర్డ్స్ పాయింట్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘2024 ప్రపంచకప్ సమయంలో జట్టు వైఫల్యాలకు నన్ను మాత్రమే నిందించారు. డ్యూడ్.. నేను ఆ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒకే ఒక్క బంతిని ఎదుర్కొన్నాను. అయినా సరే టోర్నీ మొత్తంలో ఓటమికి నన్నే బాధ్యుడిని చేస్తూ నిందించారు.
మీరంతా ఫిట్‌గా ఉండి ఏం లాభం?
మరి ఇదే టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌లో కేవలం 120 పరుగుల లక్ష్యాన్ని ఫిట్‌గా ఉన్న పాక్ ఆటగాళ్లు ఛేదించలేకపోయారు. వారంతా ఫిట్‌గా ఉండి... అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉండి ఏం లాభం మరి?’’ అని ఆజం ఖాన్ విమర్శించాడు. కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కుమారుడే ఆజం ఖాన్.
పాకిస్తాన్ తరఫున 2021లో అరంగేట్రం చేసిన 28 ఏళ్ల ఆజం ఖాన్.. ఇప్పటికి 14 టీ20 మ్యాచ్‌లు ఆడి 88 పరుగులు చేయగలిగాడు. అయితే, లీగ్ క్రికెట్‌లో మాత్రం ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు మంచి రికార్డే ఉంది. తన భారీ శరీరం కారణంగా తరచూ అతడు విమర్శలకు గురవుతూ ఉంటాడు.
ఇదీ చదవండి: IND vs NZ: ‘అతడు తుదిజట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఉండదు’


