రంజీల్లో చ‌రిత్ర సృష్టించిన త‌మిళ‌నాడు క్రికెట‌ర్‌ | Ajith Ram-4th-Tamil Nadu Player-Score Century-5 Wkt-Haul-Ranji History | Sakshi
Sakshi News home page

రంజీల్లో చ‌రిత్ర సృష్టించిన త‌మిళ‌నాడు క్రికెట‌ర్‌

Nov 5 2026 11:31 AM | Updated on Nov 5 2026 11:39 AM

Ajith Ram-4th-Tamil Nadu Player-Score Century-5 Wkt-Haul-Ranji History

Photo Credit: Twitter

రంజీ ట్రోఫీ 2026-27లో త‌మిళ‌నాడు జ‌ట్టు మూడో విజ‌యాన్ని సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌-డిలో భాగంగా చండీగ‌ఢ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో త‌మిళ‌నాడు ఇన్నింగ్స్ 259 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఫాలోఆన్ ఆడిన చండీగ‌ఢ్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 64.5 ఓవ‌ర్ల‌లో 218 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. 

ఓపెన‌ర్ అర్జున్ ఆజాద్ (60), కెప్టెన్ మ‌న‌న్ వోహ్రా (59) అర్థ‌సెంచ‌రీల‌తో రాణించగా, మ‌రో ఓపెన‌ర్ నెహాల్ పజ్నీ (26) ప‌ర్వాలేద‌నిపించాడు. త‌మిళ‌నాడు బౌల‌ర్ల‌లో అజిత్ రామ్ ఏడు వికెట్ల‌తో చండీగ‌ఢ్ ప‌త‌నాన్ని శాసించ‌గా, కెప్టెన్ సాయి కిషోర్ రెండు, శ‌ర‌వ‌ణ కుమార్ ఒక వికెట్ తీశాడు. అంత‌క‌ముందు త‌మిళ‌నాడు తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల న‌ష్టానికి 571 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. 

ప్ర‌దోశ్ రంజ‌న్ (335 బంతుల్లో 208) డ‌బుల్ సెంచ‌రీ బాద‌గా, అజిత్ రామ్ (115 నాటౌట్‌) శ‌త‌కం సాధించాడు. ఇక చండీగ‌ఢ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 94 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సోను యాద‌వ్ 4 వికెట్లు తీయ‌గా, శ‌ర‌వ‌ణ కుమార్‌, సాయి కిషోర్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ మ్యాచ్ ద్వారా త‌మిళ‌నాడు క్రికెట‌ర్ అజిత్ రామ్ రంజీ ట్రోఫీలో చ‌రిత్ర సృష్టించాడు. 

త‌మిళ‌నాడు తరఫున ఒక రంజీ మ్యాచ్‌లో సెంచ‌రీతో పాటు ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన నాలుగో క్రికెట‌ర్‌గా అజిత్ రామ్ నిలిచాడు. గ‌తంలో ఏజీ రామ్‌సింగ్ 1935-36లో (121 నాటౌట్‌; 6-32 వ‌ర్సెస్ హైద‌రాబాద్‌), బీసీ అల్వా 1950-51లో (138, 5-82 వ‌ర్సెస్ మైసూరు), ఎస్ వాసుదేవ‌న్ 1978-79లో (100 నాటౌట్‌, 5-21 వ‌ర్సెస్ కేర‌ళ‌) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక త‌మిళ‌నాడు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాలు, ఒక డ్రాతో గ్రూప్‌-డిలో తొలి స్థానంలో కొన‌సాగుతుంది.

రైల్వేస్ టార్గెట్ 379 ప‌రుగులు
గ్రూప్‌-డిలో భాగంగా రైల్వేస్ జ‌ట్టు ఎదుట ముంబై 379 ప‌రుగుల టార్గెట్‌ను ఉంచింది. ప్ర‌స్తుతం రైల్వేస్ జ‌ట్టు వికెట్ న‌ష్టానికి 22 ప‌రుగులు చేసింది. ఇషాన్ గోయ‌ల్ (15) క్రీజులో ఉన్నాడు. అంత‌క‌ముందు ముంబై త‌మ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల న‌ష్టానికి 234 ప‌రుగులకు డిక్లేర్ చేసింది. ఓపెన‌ర్ దివ్యాన్ష్ స‌క్సేనా (136 బంతుల్లో 100 నాటౌట్‌) అజేయ సెంచ‌రీ సాధించ‌గా, మ‌రో ఓపెన‌ర్ అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ (79) అర్థ‌సెంచ‌రీ చేశాడు. 

ఆఖ‌ర్లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (25 బంతుల్లో 29 నాటౌట్‌) మెరిశాడు. రైల్వేస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 259 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, అంత‌క‌ముందు ముంబై జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 396 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, అకాశ్ ఆనంద్‌, షామ్స్ ములానీ అర్థ‌సెంచ‌రీలు సాధించారు.

 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement