ఉప్పు మారితే లక్షల ప్రాణాలు నిలుస్తాయా?  | salt blend that replaces some sodium chloride with potassium chloride | Sakshi
Sakshi News home page

ఉప్పు మారితే లక్షల ప్రాణాలు నిలుస్తాయా? 

Nov 6 2026 6:17 AM | Updated on Nov 6 2026 6:17 AM

salt blend that replaces some sodium chloride with potassium chloride

అవునంటున్న తాజా అధ్యయనం 

సోడియం బదులు పొటాషియం 

లక్షల మందికి గుండెజబ్బుల నివారణ 

మరెంతో మందికి కిడ్నీ సమస్యలు దూరం 

న్యూఢిల్లీ: ఉప్పులేని కూర, ఒప్పులేని మాట అంతగా రుచించవు అని తెలుగు సామెత. అయితే ఈ ఉప్పులో ఉండే సోడియం పుణ్యమా అని చాలామంది రక్తపోటు బారిన పడుతూంటారు. వీరిలో కొందరు గుండెజబ్బులకూ గురవుతూంటారు. సోడియం క్లోరైడ్‌ స్థానంలో పొటాషియం క్లోరైడ్‌ వాడితే మాత్రం లక్షలాది మందిని కాపాడుకోవచ్చునని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 

కచ్చితంగా చెప్పుకోవాలంటే ఏటా నాలుగు లక్షల ప్రాణాలు.. 15 లక్షల మంది గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చూడాలి.  ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 30 లక్షల మంది గుండె, కిడ్నీ జబ్బుల కారణంగా మరణిస్తూంటే... దాదాపు కోటి మంది కొత్తగా ఈ రకమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉప్పులో సోడియం బదులు పొటాషియం వాడటం ద్వారా ఈ విపత్తును అడ్డుకోవచ్చునని 193 దేశాల్లో నిర్వహించిన అధ్యయనం ద్వారా తెలిసింది. ప్రఖ్యాత సైంటిఫిక్‌ జర్నల్‌ ‘నేచర్‌ హెల్త్‌’లో అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. 

   ‘‘సోడియం ఎక్కువగా తీసుకోవడం, తగినంత పొటాషియం చేరకపోవడం వల్ల రక్తపోటు ఎక్కువవుతుందని ఇప్పటికే స్పష్టంగా నిరూపితమైంది. అధిక రక్తపోటు అనేది గుండెపోటు, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలకు ఒకానొక ప్రధాన కారణమని కూడా మనకు తెలుసు. పొటాషియం క్లోరైడ్‌ ఎక్కువగా ఉన్న ఉప్పును వాడటం మొదలుపెడితే ఈ సమస్యలు రెండింటినీ ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యపరమైన లాభాలూ ఉంటాయి’’అని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త, ద జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ (ఆస్ట్రేలియా) బ్రూస్‌ నీల్‌ తెలిపారు. 

ఈ రకమైన మార్పు ద్వారా చాలా దేశాల్లో గుండెజబ్బుతో మరణించే ప్రతి పది మందిలో ఒకరిని కాపాడుకోవచ్చునని చెప్పారు. పోటాషియంతో కూడిన ఉప్పు సాధారణ ఉప్పు మాదిరిగానే ఉంటుందని, రుచిలో, వాడుకునే విధానంలోనూ ఎలాంటి మార్పులు ఉండవు, అవసరమూ లేదని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సాధారణ ఉప్పు స్థానంలో పోటాషియం, తక్కువ సోడియం ఉన్న ఉప్పు వాడమని సూచిస్తూండటం గమనార్హం. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు, అసాంక్రమిక వ్యాధుల (గుండెజబ్బుల్లాంటివి) ఇబ్బందులను తగ్గించుకునేందుకు ఇది చవకైన మార్గమని కూడా తెలిపింది.  

ఈ కొత్త రకం ఉప్పును ప్రపంచవ్యాప్తంగా వాడాలి అనుకోవడం ప్రస్తుతానికి పెద్ద లక్ష్యమేనని, కాకపోతే ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై దేశాలు ఆలోచించడం మొదలుపెట్టాలని బ్రూస్‌ నీల్‌ సూచించారు. అనేక ఆరోగ్య సమస్యలను మందుల్లేకుండా అదుపులోకి తీసుకురావచ్చునని సూచించారు. ప్రపంచం మొత్తం పొటాషియం ఎక్కువగా ఉండే ఉప్పు వాడితే? అన్న ఊహాత్మక ప్రశ్నతోపాటు అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి మాత్రమే ఇవ్వడం వంటి ప్రశ్నలకు ఈ అధ్యయనం ద్వారా సమాధానాలు రాబట్టారు.

 కనీస స్థాయిలో మార్పులు చేసినా మంచి ఫలితాలు ఉంటాయని తెలిసింది. అయితే... పొటాషియం క్లోరైడ్‌ ఎక్కువగా ఉండే ఉప్పు కిడ్నీ వ్యాధులు బాగా ముదిరిపోయిన వారిలో సమస్యలు సృష్టించే అవకాశముందని, కాకపోతే వీటితో పోలిస్తే లాభాలే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి వారు తగిన వైద్య సలహా మేరకు మాత్రమే మార్పులు చేసుకోవాలని ద జార్జియా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్‌ ప్రొఫెషనల్‌ ఫెలో, నెఫ్రాలజిస్ట్‌ వివేక్‌ ఝా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement