మన గుండెకూ ఓ మెదడు ఉందా? | Health Tips In Telugu, Does The Heart Have Its Own Brain? Know How The Heart And Brain Communicate, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

మన గుండెకూ ఓ మెదడు ఉందా?

Oct 13 2026 10:05 AM | Updated on Oct 13 2026 11:30 AM

Health Tips: Your Heart Has a Brain of Its Own and it protects against stress

మన తలలో ఓ మెదడు ఉందని మనకు తెలుసు. గుండెకు ప్రత్యేకంగా మెదడు లేదన్న విషయం మనకు తెలిసిందే. ఇలా చూస్తే ఆలోచనలకు నిలయం మెదడు. ఆ మెదడు సహా దేహంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని పంపేది గుండె. మెదడు ఆదేశాల ప్రకారమే గుండె పనిచేస్తుంది. ఇది నిజం కూడా. కాకపోతే... గుండె పూర్తిగా మెదడు ఆదేశాలు స్వీకరించే ఒక సబార్డినేట్‌ ఉద్యోగి మాత్రమే కాకపోవచ్చు! ఎందుకంటే గుండెలోనూ నాడీకణాల (న్యూరాన్స్‌) నెట్‌వర్క్‌ ఒకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు... గుండెకూ మెదడుకూ మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంటుంది. మరి గుండెకు తనదైన నాడీ వ్యవస్థ ఎందుకు? మనం భయపడినా, ఆందోళన చెందినా, ఆనందంతో ఉప్పొంగినా గుండె వేగం ఎందుకు మారుతుంది? నిద్రకూ గుండె ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి? ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

గుండెలో నాడీకణాలుంటాయా?
మన మెదడులో కోట్లాది నాడీకణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇవి ఒకదానితో మరొకటి సంకేతాలను ఇచ్చిపుచ్చుకుంటూ నిరంతరం సమాచారాన్ని ప్రాసెస్‌ చేస్తాయి. అయితే గుండెలోనూ నాడీకణాల సమూహాలు ఉంటాయన్నవిషయం చాలామందికి తెలియదు. గుండె ఉపరితలానికి సమీపంలో... ముఖ్యంగా దాని చుట్టూ ఉండే కొవ్వు కణజాలంలో...  నాడీకణాల సమూహాలు (గ్యాంగ్లియా) ఉంటాయి. 

ఇవి కలిసి పనిచేసే వ్యవస్థను ఇన్‌ట్రిన్సిక్‌ కార్డియాక్‌ నర్వస్‌ సిస్టమ్‌ అంటారు. సరదాగా చెప్పుకోవాలంటే దీన్ని ‘గుండెకు సొంతమైన చిన్న నాడీ నెట్‌వర్క్‌’గా అనుకోవచ్చు. ఈ నాడీ వ్యవస్థలోని కణాలు గుండె నుంచి వచ్చే సమాచారాన్ని స్వీకరించడమే కాకుండా, అక్కడికక్కడే (లోకల్‌గా / స్థానికంగా) ఆ సమాచారాన్ని ప్రాసెస్‌ చేసి గుండె పనితీరును నియంత్రించడంలోనూ సహాయపడతాయి. గుండె కొట్టుకునే వేగం, దాని లయ, ఇతర నాడీ సంకేతాలకు అది స్పందించే తీరు వంటి అంశాల నియంత్రణలో వీటి భూమిక / పాత్ర  ఉంటుంది. 

గుండెలో ఎన్ని నాడీకణాలు ఉంటాయనే విషయం చాలా అంశాల మీద ఆధారపడి వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. కొన్ని పరిశోధనల్లో పెద్దవారి గుండెలో సుమారు 40,000 వరకు అంతర్గత నాడీకణాలు ఉండవచ్చని ఓ అంచనా. (అయితే ఈ సంఖ్యను ప్రతి గుండెకూ వర్తించే ఖచ్చితమైన లెక్కగా పరిగణించకూడదు). 

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుండెలో నాడీకణాలు ఉన్నంత మాత్రాన దానికి మెదడులాంటి ఆలోచనా శక్తి ఉందని కాదు. జ్ఞాపకాలు ఏర్పరచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, మనుషులను గుర్తుపట్టడం వంటి పనులు గుండె చేయదు. అయితే గుండె పనితీరును నియంత్రించడంలో దాని సొంత నాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.

మరి ఈ మార్పులను ఎవరు నియంత్రిస్తారు?
ఇక్కడే మెదడుకూ గుండెకూ మధ్య ఉన్న సంబంధం తెరపైకి వస్తుంది. మన శరీరంలోని గుండె కొట్టుకోవడం, శ్వాస, జీర్ణక్రియ వంటి అనేక పనులు మనం ప్రతిసారీ నిర్దిష్టమైన ఓ స్పృహతో ఆదేశాలు ఇవ్వకుండానే వాటంతట అవే జరిగిపోతుంటాయి. వీటిని నియంత్రించడంలో ‘అటనామిక్‌ నర్వస్‌ సిస్టమ్‌’ అనే నాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
దీనిలో ప్రధానంగా రెండు విభాగాలుంటాయి.

1. సింపాథటిక్‌ నాడీ వ్యవస్థ ( సింపాథెటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌): 
ప్రమాదం ఎదురైనప్పుడు, భయపడినప్పుడు, పరుగెత్తినప్పుడు లేదా శారీరక శ్రమ చేసినప్పుడు శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. సాధారణంగా గుండె వేగం పెరగడానికి, గుండె సంకోచించే శక్తి పెరగడానికి తోడ్పడుతుంది.

2. పారా సింపాథటిక్‌ నాడీ వ్యవస్థ (పారా– సింపాథెటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌): 
మామూలు / విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వ్యవస్థలో వేగస్‌ నర్వ్‌ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఇవి రెండూ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసే స్విచ్‌ల వంటివి కావు. దేహం ఉన్న పరిస్థితిని బట్టి రెండింటి కార్యకలాపాలు ఓ సమన్వయంతో పనిచేస్తూ అవరసాన్ని బట్టి మారుతుంటాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. సమాచార ప్రవాహం మెదడు నుంచి గుండెకు మాత్రమే ఉండదు. గుండెలోని సెన్సరీ నాడీకణాలు గుండె పనితీరు, ఒత్తిడి, రసాయన పరిస్థితులకు సంబంధించిన సంకేతాలను మెదడుకు కూడా పంపుతాయి. 

ఆ సమాచారాన్ని బట్టి కూడా మెదడు తన అటానమస్‌ నర్వస్‌ సిస్టమ్‌ (స్వయంచాలక నాడీ వ్యవస్థ) ద్వారా గుండె పనితీరులో తగిన మార్పులు చేయగలదు. అంటే మెదడు గుండెకు ఆదేశాలు ఇవ్వడమే కాదు; గుండె నుంచి వచ్చే సమాచారాన్ని కూడా స్వీకరిస్తుంది. ఈ పరస్పర సంబంధాన్ని శాస్త్రవేత్తలు ‘బై–డైరెక్షనల్‌ హార్ట్‌–బ్రెయిన్‌  కమ్యూనికేషన్‌ ’ అని పేర్కొంటారు. 2024లో ప్రచురితమైన ఒక సమీక్షలో గుండెకు చెందిన ఈ అంతర్గత నాడీ వ్యవస్థ నిర్మాణం, దాని పనితీరు, గుండె లయలో మార్పులు సహా వివిధ పరిస్థితుల్లో దాని పాత్రను వివరించారు. ఈ రంగంలో పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

భయపడినప్పుడు గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది?
ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించండి. మీరు రాత్రి వేళ చీకట్లో నడుస్తున్నారు. అకస్మాత్తుగా మీ ముందే ఏదో ఆకారం కనిపించింది. అది ఏమిటో అర్థం కాకముందే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. చేతులు చెమటలు పట్టవచ్చు. శ్వాస వేగం పెరగవచ్చు.

ఇదో సహజమైన ప్రతిస్పందన... 
ఇది మనల్ని ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి లేదా అక్కడి నుంచి తప్పించుకోవడానికి సిద్ధం చేసే సహజమైన ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌ రెస్పాన్స్‌. ఇది మన మనుగడకు ఉపయోగపడే సహజమైన ప్రతిస్పందన. ఎందుకంటే... ఆ ప్రమాదకరమైన అంశంతో వీలైతే పోరాడటం చేయడం (ఫైట్‌) లేదా ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవడం (ఫ్లైట్‌) ద్వారా మనం బతికిపోవడానికి దేహం కనబరిచే సహజమైన ప్రతిస్పందన ఇది. 

అలాగే పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, ముఖ్యమైన సమావేశానికి ముందు, ఉద్యోగ సంబంధమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా గుండె వేగం పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆనందం, ఉత్సాహం వంటి సానుకూల భావోద్వేగాల (పాజిటివ్‌ ఎమోషన్స్‌)లోనూ  గుండే వేగంలో మార్పులు రావచ్చు.  

ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?
రోజువారీ జీవితంలో కొంత ఒత్తిడి సహజం. అప్పుడప్పుడు ఎదురయ్యే ఒత్తిడికి శరీరం స్పందించడం కూడా సహజమే. అయితే... సమస్య ఎప్పుడు వస్తుందంటే ఆ ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగినప్పుడు అది ఓ ముప్పుగా మారే అవకాశముంది. 

పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం గురించి ఆందోళన వంటి పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగితే శరీరం తరచుగా అప్రమత్త స్థితిలోనే ఉండవచ్చు. దీనివల్ల గుండె వేగం, రక్త΄ోటులో మార్పులు రావచ్చు. నిద్రలేమి సమస్యతో నిద్ర దెబ్బతినవచ్చు. కొందరిలో ఆహారపు అలవాట్లు మారవచ్చు, శారీరక శ్రమ తగ్గవచ్చు లేదా పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు పెరగవచ్చు. ఈ అంశాలన్నీ కలిసినప్పుడు గుండె జబ్బుల ముప్పు పెరిగే అవకాశం ఉంది.

అమెరికన్‌  హార్ట్‌ అసోసియేషన్‌  కూడా దీర్ఘకాలిక ఒత్తిడిని గుండె ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోంది. అయితే ఒత్తిడికీ గుండె జబ్బులకూ మధ్య ఉన్న సంబంధం సంక్లిష్టమైనది. ఒత్తిడి ఉందంటే తప్పనిసరిగా గుండె జబ్బు వస్తుందని కాదు; అలాగే ఒత్తిడిని తగ్గించుకున్నంత మాత్రాన గుండె జబ్బులు రావన్న హామీ కూడా ఉండదు. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమైన చర్యే కానీ, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ నియంత్రణ, వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలకు అది ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.

గుండె వేగం పెరగడం / తగ్గడం ఎందుకు జరుగుతుందంటే...
మెదడు ఒక పరిస్థితిని ప్రమాదకరమైనదిగా భావించినప్పుడు శరీరాన్ని అప్రమత్తం చేసే ప్రతిస్పందన ప్రారంభమవుతుంది. సింపాథటిక్‌ నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. అడ్రినలిన్‌  వంటి హార్మోన్ల ప్రభావంతో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు (బ్లడ్‌ ప్రెషర్‌) పెరగడం, శ్వాస వేగవంతం కావడం వంటి మార్పులు సంభవిస్తాయి.

నిద్రకూ గుండె ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి?
నిద్రపోయినప్పుడు శరీరం పూర్తిగా పనిచేయడం ఆపేస్తుందని చాలామంది అనుకుంటారు.  కానీ నిద్రలోనూ గుండె, మెదడు, ఇతర అవయవాలు తమ పనులను కొనసాగిస్తూనే ఉంటాయి. నిద్ర దశలను బట్టి గుండె వేగం, రక్తపోటు, స్వయంచాలక నాడీ వ్యవస్థ కార్యకలాపాల్లో మార్పులు వస్తాయి. నాణ్యమైన నిద్రలో శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. కానీ తరచూ నిద్ర సరిపోకపోవడం, నిద్ర సమయాలు అస్తవ్యస్తంగా ఉండటం లేదా నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఉంటే ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు.

దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతుండటం, అధిక రక్తపోటు (హైబీపీ), ఊబకాయం, మధుమేహం (డయాబెటిస్‌) వంటివి గుండె జబ్బులకు దారితీసే ముప్పు ఉంది. ముఖ్యంగా అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా ఉన్నవారిలో నిద్రలో పదేపదే శ్వాస ఆగిపోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్‌  స్థాయులు తగ్గవచ్చు. శరీరంపై అదనపు ఒత్తిడి పడవచ్చు. ఇలాంటి పరిస్థితిలో వైద్య పరీక్షలు, చికిత్స అవసరం కావచ్చు. 

అమెరికన్‌  హార్ట్‌ అసోసియేషన్‌  పెద్దవారు సాధారణంగా ప్రతి రాత్రీ 7–9 గంటల పాటు కంటినిండా నిద్రపోవాలంటూ సూచిస్తోంది. అయితే ఈ సమయం అన్నది వ్యక్తిగత అవసరాలను బట్టి మారుతుండవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే... నిద్ర సమయంతో పాటు నిద్రలో నాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ స్లీప్‌) కూడా ముఖ్యం. అందుకే నిద్రను వృథా అవుతున్న సమయంగా చూడకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో దానికీ తగిన స్థానం ఇవ్వాలి.

హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీ (హెచ్‌ఆర్‌వీ) అంటే...? 
మన గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటోందనుకుందాం. అంటే ప్రతి రెండు గుండె చప్పుళ్ల మధ్య సమయం ఎప్పుడూ సరిగ్గా ఒకేలా ఉంటుందా? తప్పనిసరిగా కాదు. ఒక చప్పుడుకూ మరొక చప్పుడుకూ మధ్య ఉండే వ్యవధిలో సహజమైన చిన్నచిన్న మార్పులు ఉంటాయి. వీటిని హార్ట్‌ రేట్‌ వెరియబిలిటీ (హెచ్‌ఆర్‌వీ) అంటారు.

ఈ మార్పులను స్వయంచాలక నాడీ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. శ్వాస, శారీరక శ్రమ, నిద్ర, వయసు, మందులు, అనారోగ్యం వంటి అనేక అంశాలు హెచ్‌ఆర్‌వీపై ప్రభావం చూపుతాయి. అయితే హెచ్‌ఆర్‌వీ ఎక్కువగా ఉంటే ఆరోగ్యం అంతా బాగున్నట్టేననీ లేదా తక్కువగా ఉంటే గుండె జబ్బు ఏదైనా ఉండవచ్చన్నది అంత తేలిగ్గా నిర్ణయించడం సాధ్యం కాదు. 

అవి... ఆ వ్యక్తి తాలూకు పరిస్థితి, గుండె తాలూకు వివరాలను కొలిచిన టైమ్, విధానం, అతడి ఇతర ఆరోగ్య వివరాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్‌ పరికరాలు కూడా ‘హెచ్‌ఆర్‌వీ’ని కొలుస్తున్నాయి. ఇవి రోజువారీ మార్పులను గమనించడానికి ఉపయోగపడవచ్చు. కానీ వాటి ఆధారంగా గుండె జబ్బులను నిర్ధారణ చేయడం లేదా వైద్య చికిత్సను మార్చుకోవడం సరికాదు.

ఇలాంటి సందర్భాల్లో మాత్రం డాక్టర్‌ను సంప్రదించాల్సిందే...
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. భావోద్వేగాల వల్ల గుండె వేగం పెరగడం అన్నది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది చాలా సందర్భాల్లో సాధారణ శారీరక ప్రతిస్పందనగానే పరిగణించాలి. కానీ గుండె వేగం తరచుగా అసాధారణంగా పెరగడం, గుండె లయ తప్పినట్లు అనిపించడం లేదా దానితో పాటు ఛాతినొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని కేవలం ఒత్తిడికి ఆపాదించకుండా వైద్య సహాయం తీసుకోవాలి.

గుండెకు తనదైన ఓ సొంత విద్యుత్‌ వ్యవస్థ కూడా... 
గుండెలో నాడీకణాలున్నాయనే విషయం ఒక ఆసక్తికరమైన అంశమైతే, గుండె కొట్టుకోవడానికి ప్రతిసారీ మెదడు నుంచి ఆదేశం రావాల్సిన అవసరం లేదనేది మరో అద్భుతమైన విషయం.గుండెలో సైనోఏట్రియల్‌ నోడ్‌  (లేదా సంక్షిప్తంగా ఎస్‌ఏ నోడ్‌) అనే ప్రత్యేక కణాల సమూహం ఉంటుంది. దీన్ని గుండె తాలూకు సహజమైన పేస్‌మేకర్‌ అంటారు. 

ఈ కణాలు స్వయంగా విద్యుత్‌ సంకేతాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ సంకేతాలు గుండెలోని విద్యుత్‌ ప్రసరణ వ్యవస్థ ద్వారా వ్యాపించి, గుండె గదులు క్రమపద్ధతిలో సంకోచించి రక్తాన్ని పంప్‌ చేసేలా సహాయపడతాయి. అందుకే గుండె తన సహజమైన లయను తానే స్వయంగా నిర్వహించుకోగలదు. అయితే గుండె వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం నడిచినా, పరుగెత్తినా, విశ్రాంతి తీసుకున్నా, భయపడినా లేదా నిద్రపోయినా దాని వేగం మారుతుంది. 

మరి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?
గుండె–మెదడు సంబంధం గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే. కానీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం రోజువారీ అలవాట్ల విషయంలో ఉంది. ఒత్తిడిని గుర్తించడం: నిరంతర ఆందోళన, చిరాకు, మానసిక అలసట ఉంటే వాటిని పట్టించుకోకుండా వదిలేయకూడదు. అవసరమైతే గుండె వైద్య నిపుణలను గానీ లేదా అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుడిని కలిసి వారి సహాయం తీసుకోవాలి.

నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం: 
సాధ్యమైనంతవరకు ఒక నిర్ణీతమైన వేళల్లోనే పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.. గురకతో పాటు నిద్రలో ఊపిరి ఆగిపోవడం, పగటిపూట విపరీతమైన నిద్రమత్తు ఉంటే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం: 
వారి వారి వయసూ, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వారికి తగినట్లుగా నడక లేదా ఇతర వ్యాయామాన్ని ఎంచుకోవాలి.  ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తాము వ్యాయామం మొదలుపెట్టే ముందర తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తాము ఏమేరకు వ్యాయామం చేయవచ్చన్నది వైద్యుడి సలహా మేరకు మాత్రమే నిర్ణయించుకోవాలి.

బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌లను నియంత్రించడం: 
అన్ని పోషకాలూ ఉండే ఆరోగ్యకరమైన  సమతులాహారం తీసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్‌ సూచించిన మందులను క్రమంగా వాడటం ముఖ్యం.

పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం: 
పొగాకు గుండె–రక్తనాళాల ఆరోగ్యానికి హానికరం. అలాగే వీలైనంతవరకు మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

ఒత్తిడి తగ్గించుకోవడం: 
విశ్రాంతి, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సంగీతం వినడం, ఇష్టమైన హాబీల్లో పాల్గొనడం వంటి పద్ధతులు కొందరిలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడవచ్చు.

ఇదీ చదవండి: జస్ట్‌ 30 సెకన్ల బ్రేక్‌ఫాస్ట్‌ ఐడియాతో..నెలకు రూ. 1 కోటి సంపాదన!

చివరగా...
గుండెకు మెదడులాంటి ఆలోచనా శక్తి లేకపోవచ్చు. కానీ గుండె పూర్తిగా మెదడు ఆదేశాల కోసం ఎదురుచూసే అవయవమూ కాదు. దానికి తనదైన విద్యుత్‌ వ్యవస్థ ఉంది. గుండెలోనే నాడీకణాల నెట్‌వర్క్‌ ఉంది. మెదడుకూ గుండెకూ మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. మన భావోద్వేగాలూ, ఒత్తిడీ, నిద్ర, శారీరక శ్రమ వంటి అంశాలు ఈ వ్యవస్థల పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గుండెను మాత్రమే కాకుండా మన మొత్తం ఆరోగ్యాన్ని, జీవన శైలిని కూడా పట్టించుకోవాలి.

గుండెకు మెదడు ఉందా? అన్న ప్రశ్నకు నేరుగా ఇచ్చే సమాధానం ‘లేదు’ అనే అయినప్పటికీ... గుండెకు సొంత నాడీ వ్యవస్థ ఉందన్న విషయం మాత్రం నిజం. ఆ వ్యవస్థ గురించి మనకు తెలిసే కొద్దీ, గుండెను అర్థం చేసుకునే తీరు మారుతూ ఉంటుంది... దాంతో మన అవగాహనా మరింతగా విస్తరిస్తుంటుంది.  
డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌. 
నిర్వహణ యాసీన్‌ 

ఇదీ చదవండి: వ్యాయామం చేయకుండానే క్రియాటిన్‌ కండరాలను పెంచుతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement