కొందరు ఉద్యోగ కెరీర్‌లో ఉన్నతికి ఎదగడంలో తడబడుతుంటారు. మరికొందరు తరుచుగా కంపెనీలు మారుతుండటంతో వెనుకబడినవారు కూడా ఉన్నారు. అయితే కొందరే దేదీప్యమానంగా కెరీర్‌ని శిఖరాగ్ర స్థాయిలో నిర్మించుకుని ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ టెకీ.
ఆ అమ్మాయే పాట్నాకు చెందిన సృష్టి శ్రేయ సింగ్. ఆమె ఆర్జించడం విద్యార్ధి దశలో ఇంటర్న్‌షిప్‌లతో మొదలైంది. ఐఐటీ పాట్నాలో చదువుకున్న సృష్టి గత ఎనిమిదేళ్లలో తన ఆదాయం ఎలా పెరిగిందో వివరించింది. ఆ వీడియోలో తన వృత్తిపరమైన మైలురాళ్ల గురించి కెరీర్‌లో తన ప్రతి దశలోనూ తన ఆదాయం ఎలా మారిందో పంచుకుంది.
గూగుల్ ఇంటర్న్‌షిప్ నుంచి ఎంబీఏ వరకు..
సృష్టి తన వృత్తి ప్రయాణాన్ని 2019లో గూగుల్‌లో ఇంటర్న్‌షిప్‌తో ప్రారంభించారు. దీని ద్వారా ఆమెకు రూ. 40,000 లభించాయి. మరుసటి ఏడాది ఆమె మరో రెండు ఇంటర్న్‌షిప్‌లు చేశారు. తద్వారా 2020లో ఆమె మొత్తం ఆదాయం రూ. 60,000కు చేరుకుంది. 2021లో సృష్టి తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఎంబిఏ ప్రోగ్రామ్‌లో చేరారు. అయితే అదే సమయంలో ఆమె రెండు నెలల పాటు పూర్తికాల ఉద్యోగం కూడా చేశారు.
ఆ సమయంలో సంపాదించిన డబ్బును తన ఎంబీఏ ఫీజు చెల్లించడానికి ఉపయోగించుకున్నారు. ఆ టైంలో మొత్తం రూ. 1.5 లక్షలు రాగా, ఆ మొత్తాన్ని ఎంబీఏ ఫీజు చెల్లించేందుకు ఖర్చు చేసినట్లు పేర్కొంది. 2022లో కోల్‌గేట్ పామోలివ్ (Colgate-Palmolive) సంస్థలో ఇంటర్న్‌షిప్ లభించడంతో ఆమె ఆదాయం మరోసారి పెరిగింది. ఆ కంపెనీ ఆమెకు నెలకు రూ. 1.6 లక్షల స్టైఫండ్ ఇచ్చింది. అక్కడ రెండు నెలల పాటు పనిచేసిన ఆమె మొత్తం రూ. 3.2 లక్షలు సంపాదించారు. ఉద్యోగ మార్పుతో రూ. 35 లక్షలకు చేరిన ఆదాయం. ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే సింగ్ 2023 జూలైలో ఒక కార్పొరేట్ సంస్థలో పూర్తికాల ఉద్యోగంలో చేరారు.
ఏడాది మధ్యలో చేరడం వల్ల డిసెంబర్ నాటికి ఆమె ఆదాయం రూ. 15 లక్షలుగా నమోదైంది. ఆ తర్వాత ఏడాది ఆమె ఉద్యోగం మారడంతో ఆమె ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ మార్పులో భాగంగా ఆమెకు 'జాయినింగ్ బోనస్' కూడా లభించడంతో, 2024లో ఆమె మొత్తం ఆదాయం రూ. 35 లక్షలకు చేరుకుంది. అయితే 2025లో జాయినింగ్ బోనస్ ఏదీ లభించకపోవడంతో ఆ ఏడాది ఆదాయం రూ. 30 లక్షలుగా ఉంది.
అమెరికా పయనం..కోటిపైనే ఆదాయం..
2026లో సింగ్ జీవితంలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆమె అమెరికాకు వెళ్లారు. ఆ ఏడాది ఆమె సంపాదన రూ. కోటి దాటిందని ఆమె స్వయంగా వెల్లడించారు. అమెరికాలో ఒక స్టార్టప్‌లో చేరడానికి ముందు, సింగ్ గూగుల్ (Google), యాక్సెంచర్ (Accenture), ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G) వంటి పలు ప్రముఖ సంస్థలలో పనిచేశారు.
ఆమె అమెరికాలో మంచి ఆర్థిక వనరులు కలిగిన స్టార్టప్‌లో 'గ్రోత్ అండ్ మార్కెటింగ్' (growth and marketing) విభాగంలో పనిచేస్తోంది. ఈ కార్పొరేట్ ఉద్యోగం తోపాటు సింగ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ కూడా వ్యవహరిస్తున్నారు. కెరీర్, విద్య, వృత్తిపరమైన అనుభవాలనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ..ఉద్యోగ జీవితంలోని వివిధ అంశాల గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తున్నారు.


