శరీరదారుఢ్యం కోసం ప్రయత్నించే వారందరికీ ‘క్రియాయేటిన్’ సుపరిచితమైన పేరు. వ్యాయామం చేసేవారు కండరాల బలం, శక్తిని పెంచుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు, వైద్యులు, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ నమ్ముతూ వచ్చారు. అయితే, ఎలాంటి వ్యాయామం చేయకుండా కేవలం క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా కండరాల ద్రవ్యరాశి పెరుగుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది.
‘జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్’లో ప్రచురితమైన కథనం ప్రకారం క్రియాటిన్ సప్లిమెంట్ తీసుకుంటే కండరాల ద్రవ్యరాశి పెరుగుతుంది, వ్యాయామం చేయడం తప్పనిసరి కాదు. 45 –65 మధ్య వయసులో ఉన్న 64 మంది ఆరోగ్యవంతుల మీద నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ తాజా పరిశోధన ప్రకారం, వ్యాయామం చేయని మధ్య వయస్కులలో కూడా క్రియేటిన్ కండరాల వృద్ధికి తోడ్పడినట్లు తేలింది.
ఫిట్‌నెస్‌కు కొత్త దారి
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో కొందరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయగా, మరికొందరు ఎలాంటి వ్యాయామం చేయకుండా కేవలం క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకున్నారు. ఎలాంటి వ్యాయామం చేయకుండా కేవలం క్రియాటిన్ తీసుకున్న వారు 12 వారాల్లో సుమారు 2.4 పౌండ్ల లీన్ మజిల్ (కండర కణజాలం) ను పొందినట్లు పరిశోధకులు గుర్తించారు.
వ్యాయామంతో మరింత ఎక్కువ ప్రయోజనం ఉందని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. క్రియాటిన్‌ను వ్యాయామం– డైట్‌తో పాటు కలిపి తీసుకున్నవారు సుమారు 3 పౌండ్ల కండర ద్రవ్యరాశిని పెంచుకున్నారు. అంతేకాకుండా వీరిలో శరీర కొవ్వు శాతం తగ్గడం, బలం మరింత పెరగడం లాంటి మెరుగైన ఫలితాలు కనిపించాయి.
మెదడు పనితీరు, ఆరోగ్య మెరుగుదల కనిపించింది. క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకున్న వారిలో కేవలం కండరాల బలం మాత్రమే కాకుండా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ, జ్ఞాపకశక్తి మెరుగుదల, మెదడు పనితీరులో సానుకూల మార్పులు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.
వ్యాయామం లేకుండా కండరాలు పెరగడం సాధ్యమేనా!
క్రియాటిన్ (Creatine) అనేది కండరాల కణాలలో శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడే ఒక సహజ పదార్థం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రియాటిన్ తీసుకోవడం వల్ల కండరాలకు శక్తి అంది రోజువారీ చిన్నపాటి శారీరక కార్యకలాపాలు చేయడానికి ఉత్సాహం వస్తుంది. దీనివల్ల శరీరం చురుగ్గా మారి కండర క్షీణత నివారణకు దోహదపడుతుంది. ప్రత్యేకించి వయసు మళ్లే కొద్దీ వచ్చే కండరాల బలహీనతను నివారించడంలో ఇది బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: హాబీతో కేన్సర్‌ని జయించిన మహిళ!
ఈ అధ్యయనం ప్రధానంగా మధ్య వయస్కులు, వృద్ధులలో కండరాల సంరక్షణకు క్రియాటిన్ ఏ విధంగా సహాయపడుతుందనే కోణంలో జరిగింది. క్రియాటిన్ కండరాలలో నీటిని పట్టి ఉంచడం ద్వారా కొంత ద్రవ్యరాశి పెరిగినట్లు కనిపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాయామం చేయకుండా కేవలం సప్లిమెంట్స్ మీద మాత్రమే పూర్తిగా ఆధారపడటం కంటే, సరైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కలిపి తీసుకుంటేనే అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఇదీ చదవండి: కీళ్లెంచి మేలెంచేలా...!
క్రియాటిన్ అనేది కేవలం అథ్లెట్లు, వ్యాయామం చేసేవారికే పరిమితం కాదని, వయసు పెరిగే కొద్ది కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఈ అధ్యయనం నిరూపిస్తోంది. అయితే ఏదైనా కొత్త సప్లిమెంట్ వాడే ముందు శరీర తత్వాన్ని బట్టి వైద్య నిపుణులను కానీ డైటీషియన్‌ను కానీ సంప్రదించడం మంచిది.


