జిమ్‌లో పనిచేసే ఒక వ్యక్తి, కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ లంబోర్ఘిని (Lamborghini) కారును ఎంతో ఆసక్తిగా గమనిస్తుండటాన్ని గమనించిన కారు యజమాని స్పందించిన తీరు నెట్టింట విశేషంగా నిలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త కురపాటి నాగ వెంకట రాకేష్ కుమార్ తీసుకున్న ఒక ఆసక్తికర నిర్ణయం నెటిజనులను ఆలోచింప చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా రాకేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోకు 2.7 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అసలేం జరిగిందంటే..
జిమ్‌లో ప్రతిరోజూ జరిగే ఒక సాధారణ సందర్భాన్ని, క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి జీవితాంతం గుర్తుంచుకోదగ్గ మధుర జ్ఞాపకంగా ఎందుకు మార్చాలనుకున్నారో రాకేష్ తన పోస్ట్‌లో వివరించారు. రోజూ జిమ్‌లో తన లంబోర్గిని సూపర్‌కారును ఆరాధనగా చూసే జిమ్ క్లీనర్‌ను గమనించారు. తన రాగానే సంతోషంగా తనవైపు చూడటంతోపాటు, ఒకరోజు దానితో ఫోటోలు దిగడం రాకేష్ కంట పడింది. ఈ సందర్బంగా ఒకప్పుడు సేల్స్‌మన్‌గా పనిచేస్తూ కేవలం 800 రూపాయల వేతనం పొందుతున్న రోజులను రాకేష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఒక సూపర్ కార్ సొంతం చేసుకోవాలని కలలు కన్న జ్ఞాపకాలు మనసులో కదలాడాయి. అందుకే అతని మనుసులోని కోరికను అర్థం చేసుకున్నారు. అందుకే తనకి ఒక మధురమైన అనుభూతిని మిగల్చాలనుకుని బహుశా క్లీనర్ ఎప్పుడూ ఊహించని పని చేశారు. తన కారు తాళాలు అతని చేతికిచ్చి డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి కారులో కూర్చునే అవకాశం కల్పించారు. ఫలితంగా ఆ క్లీనర్ కళ్లలో కనిపించిన ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ ఆనందాన్ని తన ఫాలోయర్లతో కూడా పంచుకోవాలని భావించారు.
ఇదీ చదవండి: ఆయుధపూజలో ఏకే-47తో ‘లేడీ సింగం’ వీడియో వైరల్
గతంలో తాను రూ. 800 జీతానికి సేల్స్‌మన్‌గా పనిచేసే రోజుల్లో సూపర్‌కార్ల యజమానులను చూసి ముచ్చటపడేవాడినని,కానీ అప్పట్లో యజమానులు తన్ను పట్టించుకోలేదని, భవిష్యత్తులో తాను విజయవంతమైతే ఎవరినీ అలా నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు రాకేష్ వెల్లడించారు. ఈ హృదయపూర్వక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లుఆ వ్యాపారవేత్త వినయవిధేయతను, మంచి మనసును ప్రశంసించారు.ఎంత ఎత్తుకు ఎదిగినా తాము నడిచి వచ్చిన దారిని మర్చిపోకూడదని, హోదా పెరిగినా పాత రోజులను మర్చిపోకుండా వినయం, మానవత్వంతో వ్యవహరించిన వ్యాపారవేత్తపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇదీ చదవండి: కన్నతల్లి చేతిలో చిన్నారి హత్య : కన్నీరుమున్నీరవుతున్న తండ్రి


