పార్లమెంట్‌లో చర్చించే దమ్ముందా? | Amit Shah has launched a sharp attack on Congress leader Rahul Gandhi | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో చర్చించే దమ్ముందా?

Nov 6 2026 5:30 AM | Updated on Nov 6 2026 6:20 AM

Amit Shah has launched a sharp attack on Congress leader Rahul Gandhi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీకి కేంద్ర మంత్రి అమిత్‌ షా సవాల్‌ 

పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించడాన్ని కాంగ్రెస్‌ సంస్కృతిగా మార్చేశారు  

చొరబాటుదారులను కాపాడడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయి  

ఓటమికి ఎన్నికల సంఘంపై, ఈవీఎంలపై నిందలేస్తున్నారని ధ్వజం

హరియాణాలో ‘లోక్‌తంత్ర బచావో, అరాచకతా హఠావో’ర్యాలీ

కర్నాల్‌: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాందీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించడం, సభను బహిష్కరించి బయటకు వెళ్లిపోవడాన్ని రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ సంస్కృతిగా మార్చేశారని విమర్శించారు. ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి చొరబాటుదారులను కాపాడడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారులను గుర్తించి, తొలగించాలనేది బీజేపీ సంకల్పమని స్పష్టంచేశారు. గురువారం హరియాణాలోని కర్నాల్‌ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ‘లోక్‌తంత్ర బచావో, అరాచకతా హఠావో’ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు. 

దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని రాహుల్‌ గాం«దీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో చర్చలకు పార్లమెంటే అత్యున్నత వేదిక అని తేల్చిచెప్పారు. రాహుల్‌ గాంధీ మాత్రం పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వడం లేదు, ప్రజల సమస్యలపై చర్చించడం లేదని ధ్వజమెత్తారు. సభలో ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడం, బాయ్‌కాట్‌ చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు. 80 ఏళ్ల ప్రజాస్వామ్యం ప్రతిపక్షాల కుతంత్రాలకు ఎప్పటికీ లొంగిపోదని తేల్చిచెప్పారు. పార్లమెంట్‌లో కావచ్చు, శాసనసభలో కావచ్చు, గ్రామాల్లో కావొచ్చు.. ఎక్కడైనా సరే విపక్షాలకు బీజేపీ తగిన సమాధానం చెబుతుందని అన్నారు. అమిత్‌ షా ఇంకా ఏం మాట్లాడారంటే..  

చొరబాటుదారులను బహిష్కరిస్తే తప్పేంటి?  
‘‘ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)పై చర్చించడానికి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిద్దాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అర్థవంతమైన చర్చ కావాలంటే ప్రతిపక్షాలు పార్లమెంట్‌కు రావాలి. చర్చలో పాల్గొనాలి. నవంబర్‌ 1న ప్రతిపక్షాలు నిర్వహించిన ర్యాలీకి ‘ఓటు బచావో’అని పేరు పెట్టుకున్నారు. నిజానికి అది ఘుస్‌పైఠియా ర్యాలీ (చొరబాటుదారులను కాపాడే ర్యాలీ). చొరబాటుదారుల విషయంలో ప్రధాని మోదీకి దృఢ సంకల్పం ఉంది. వారిని గుర్తించడం, ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, దేశం నుంచి బహిష్కరించడం మా విధానం. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి, చొరబాటుదారులను దేశం నుంచి బహిష్కరిస్తే తప్పేంటి?  

విదేశీ పర్యటనల మర్మమేంటి?  
రాహుల్‌ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. లోక్‌సభలో ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి విదేశీ పర్యటనల వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఆయన ఇప్పుడే వియత్నాం నుంచి తిరిగి వచ్చారు. కానీ, దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. పారదర్శకత ఉండాలి కదా! ఆయన చేసిన విదేశీ పర్యటనలన్నింటి గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలి. వియత్నాంలో ఎన్ని రోజులు ఉన్నారు? ఎవరిని కలిశారు? అక్కడికి ఎందుకు వెళ్లారు? ఆయన కార్యక్రమం ఏమిటో చెప్పాలి.  

ప్రజలు వారిని పదేపదే తిరస్కరించారు  
రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతోంది. ఒక సామెత ఉంది. ఏ దారీ దొరకనప్పుడు పిల్లి ఒక స్తంభాన్ని పట్టుకుని గీరుతుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. రాహుల్‌ తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లే బదులు, పార్లమెంట్‌లో చర్చకు రావాలి. ఆయన రాజ్యాంగ ప్రతిని ప్రదర్శిస్తారు కానీ రాజ్యాంగపరమైన బాధ్యతలను నెరవేర్చరు. పార్లమెంట్‌ను, స్పీకర్‌ను, న్యాయవ్యవస్థను అవమానిస్తారు. పైగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ప్రజలు రాహుల్‌ గాం«దీని, కాంగ్రెస్‌ను పదేపదే తిరస్కరించారు. కాంగ్రెస్‌ మాత్రం తమ ఓటమికి ఎన్నికల సంఘాన్ని, ఎస్‌ఐఆర్‌ను నిందిస్తూనే ఉంది.  

మరణించిన వారు ఓటు వేయగలరా?  
ఎస్‌ఐఆర్‌పై మేము పూర్తిస్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాహుల్‌ గాంధీ ముందుగా అబద్ధాలు చెప్పడం ఆపాలి. 13 కోట్ల ఓట్లను తొలగించారని అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాలను వారు ఇప్పటికీ బయటపెట్టలేదు. తొలగించిన వారిలో 2.5 కోట్ల మంది మరణించారు. వారు ఓటు వేయగలరా? 6 కోట్ల మందికి పైగా ప్రజలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఒక కోటి మంది పేర్లు మూడు కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉన్నాయి. 3 కోట్ల మంది ఎన్నికల సంఘం ముందు హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే రాహుల్‌ గాంధీ పార్టీ చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జబితాలో నమోదు చేయించింది.  

అక్కడ కాంగ్రెస్‌ ఎలా గెలిచింది?  
అన్ని ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) లోపభూయిష్టమైనవని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. కేరళలో అవే ఈవీఎంలతో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారు? తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎలా గెలిచింది? అక్కడ కూడా ఈవీఎంలే ఉపయోగించారు కదా! ఉత్తరప్రదేశ్‌లో ఒక సామెత ఉంది. నాచ్‌ నా జానే ఆంగన్‌ టేఢా(ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు). దేశ ప్రజలు కాంగ్రెస్‌ను అంగీకరించడం లేదు. ఇకనైనా ఆ విషయం ఒప్పుకోవాలి. 

అత్యవసర సమస్యలను రోడ్లపై చర్చించాలా లేక పార్లమెంట్‌లో చర్చించాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. రాహుల్‌ గాం«దీకి రోడ్ల మీద చర్చలు జరపడం అంతగా ఇష్టమైతే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చర్చకు నరేంద్ర మోదీ ముందుకు రావాలని, వేదిక ఎక్కడో చెప్పండి అని అడుగుతున్నారు కదా. సరే, మోదీని పక్కన పెట్టండి. హరియాణాలో ఏదో ఒక కూడలిని ఎంచుకోండి. మా యువ మోర్చా అధ్యక్షుడు చర్చకు వస్తారు. పార్లమెంట్‌లో చర్చిద్దామంటే రాహుల్‌ పారిపోతారని మాకు తెలుసు. ఆయనకు పార్లమెంట్‌లో చర్చించే దమ్ముందా?’’ అని అమిత్‌ షా సవాల్‌ విసిరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement