మంత్రి దామోదరను విచారణకు పిలవడంపై కాంగ్రెస్‌లో చర్చ
సీడబ్ల్యూసీ సభ్యుడైన మంత్రిని టీపీసీసీ చీఫ్ విచారించడంపై అభ్యంతరాలు
గాందీభవన్‌కు రాని దామోదర.. వెనుదిరిగిన మహేశ్‌గౌడ్
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం గైర్హాజరు.. మరోసారి పిలుస్తామన్న టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించే విషయంలో పార్టీ నేతల మధ్య అధికార పరిధి, హోదాల అంశం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలో జరిగిన ఓ గొడవకు సంబంధించి మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును విచారణకు పిలవడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత సభ్యుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత సీనియర్ మంత్రిని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విచారణకు పిలవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి పరిధి ఎంత? ఏ స్థాయి నాయకుడిని ఎవరు విచారించాలి? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మంత్రి దామోదర తనను దుర్భాషలాడినట్టు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్.. ఇద్దరినీ గాం«దీభవన్‌కు పిలిచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం విచారణకు హాజరుకావాలని ఇద్దరు నాయకులకు సూచించారు. ఉద యం 11.30 గంటలకు మంత్రి దామోదర, 12.30 గంటలకు లక్ష్మీకాంతారావు గాం«దీభవన్‌కు రానున్నట్టు మీడియా వేదికగా టీపీసీసీ కార్యాలయం తెలిపింది.
ఈ మేరకు ఉదయాన్నే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గాం«దీభవన్‌కు వచి్చనా, మంత్రి దామోదర హాజరుకాలేదు. ఈ వ్యవహారంలో మంత్రి దామోదర విచారణకు హాజరుకాకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న ఆయన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విచారణకు పిలవడం ఏంటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో టీపీసీసీ అధ్యక్షుడికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేతల విషయంలో అనుసరించాల్సిన విధానం గురించి తెలియకపోవడం ఏంటని మంత్రి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
సీడబ్ల్యూసీ సభ్యుడిని విచారించే అధికారం ఎవరికి ఉంటుందో టీపీసీసీ చీఫ్ తెలుసుకొని విచారణకు పిలవాల్సిందని వారు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు, పార్టీ విషయంలో ఎవరైనా ఒకటేనని, సీఎం అయినా కార్యకర్త అయినా పార్టీ తర్వాతేనని గతంలోనే టీపీసీసీ చీఫ్ స్పష్టం చేసిన విషయాన్ని మహేశ్‌గౌడ్ వర్గీయులు గుర్తు చేస్తున్నారు. అంతర్గత సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి రాకపోవడంతో అదే దారిలో ఎమ్మెల్యే..
గురువారం మంత్రి దామోదర గాం«దీభవన్‌కు రాకపోవడంతో ఆయన కోసం కొంతసేపు వేచి చూసిన మహేశ్‌గౌడ్ చివరకు వెనుదిరిగారు. మంత్రి హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూడా విచారణకు రాలేదు. దీంతో ఇద్దరి నుంచి వివరణ తీసుకోవాలన్న టీపీసీసీ ప్రయత్నం తొలిరోజే ముందుకు సాగలేదు. మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరూ గైర్హాజరు కావడం, సీడబ్ల్యూసీ సభ్యుడిని విచారణకు పిలవడం అనే అంశం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని టీపీసీసీ ఎలా ముందుకు తీసుకెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా మంత్రి, ఎమ్మెల్యే విచారణకు రాలేదని, వారిద్దరినీ మరోసారి పిలిచి వివరణ తీసుకుంటామని టీపీసీసీ మీడియాకు సమాచారం ఇచి్చంది. దీంతో ఢిల్లీ ఘటనపై మొదలైన వివాదం ఇప్పుడు కాంగ్రెస్‌లో సంస్థాగత అధికారాలు, సీనియారిటీ, అంతర్గత క్రమశిక్షణ అంశాల చుట్టూ చర్చకు దారితీసింది.


