ట్రూ అప్‌ షాక్‌ షురూ | Big Shock to Telangana Electricity Consumers in Telangana | Sakshi
Sakshi News home page

ట్రూ అప్‌ షాక్‌ షురూ

Nov 6 2026 5:07 AM | Updated on Nov 6 2026 5:07 AM

Big Shock to Telangana Electricity Consumers in Telangana

విద్యుత్‌ వినియోగదారులపై అదనపు భారం 

2022–23, 2023–24కు సంబంధించిన రూ.7,635.22 కోట్లు వసూలు 

నవంబర్‌ బిల్లులోనే యూనిట్‌కు 30 పైసలు వసూలు 

వచ్చే నెల నుంచి యూనిట్‌కు 50 పైసలు 

26 నుంచి 29 నెలల పాటు కొనసాగనున్న అదనపు బాదుడు

సాక్షి, హైదరాబాద్‌: నవంబర్‌ కరెంట్‌ బిల్లు మధ్య తరగతి కుటుంబాలకు షాక్‌ ఇస్తోంది. ట్రూ అప్‌ భారం తడిసి మోపెడవుతోంది. ఎలాంటి సబ్సిడీ లేని కుటుంబాలకు నెలవారీ బిల్లులో వందల నుంచి వేల రూపాయల అదనపు భారం పడుతోంది. కరువుతో ఓ వైపు నిత్యావసరాలు అకాశాన్నంటుతున్నాయి. తాజాగా విద్యుత్‌ చార్జీల మోతతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన ట్రూ అప్‌ చార్జీలను విద్యుత్‌ నియంత్రణ మండలి ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్‌ బిల్లు నుంచి వీటిని అమలు చేస్తున్నారు. 

2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ కొనుగోళ్లు, ఆదాయం మధ్య గ్యాప్‌ను డిస్కమ్‌లు రూ.7,635.22 కోట్లుగా పేర్కొన్నాయి. విద్యుత్‌ సంస్థలు ప్రతిపాదించిన ధర కన్నా మార్కెట్లో ఎక్కువ ధరకు..22–23 సంవత్సరానికి రూ.5,186 కోట్లకు పైగా, 23–24 సంవత్సరానికి రూ.2,448 కోట్లకు పైగా విద్యుత్‌ కొనుగోలు చేశారు. ప్రతిపాదించిన దానికన్నా ఎక్కువగా ఉన్నదాన్ని ట్రూ అప్‌ అంటారు. ఈ అంతరాన్ని పూడ్చుకునేందుకు విద్యుత్‌ సంస్థలు ట్రూ అప్‌ చార్జీల పేరిట వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి. అయితే ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ఈ భారాన్ని డిస్కమ్‌లు ఇప్పుడు బయటకు తీశాయి. 

ఇది ఆరంభమే.. 
మొదటి నెల కాబట్టి యూనిట్‌కు 30 పైసలు వసూలు చేస్తున్నట్టు డిస్కమ్‌లు తెలిపాయి. వచ్చే నెల నుంచి 50 పైసలు వసూలు చేయనున్నాయి. ఈ వసూళ్ల కార్యక్రమం అదనపు వ్యయం రాబట్టుకునే వరకు దాదాపు 26 నుంచి 29 నెలల పాటు కొనసాగుతుంది. స్మార్ట్‌ మీటర్లు కావడం వల్ల సెల్‌ఫోన్‌ చార్జర్‌కు వాడే విద్యుత్‌ను కూడా మీటర్‌ లెక్కిస్తుంది. ఈ లెక్కన నెలకు సగటున 600 నుంచి 2,000 యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారులు వాడతారు. ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా కొన్నాళ్లుగా ప్రతీ ఇంట్లో ఏసీల వాడకం పెరిగింది. దీంతో ప్రతి కుటుంబానికి అసలు బిల్లు కాకుండా అదనంగా రూ.300 నుంచి రూ.1,000 వరకూ    అదనంగా విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి.  

అప్పటి వ్యయం ఇప్పుడు వసూలు 
వాస్తవానికి 2022–23, 2023–24లో ఏ కుటుంబంలోనూ ఇంత విద్యుత్‌ వాడకం లేదు. ఇప్పటిలాగా వర్షాకాలం, చలికాలంలోనూ ఏసీలు, ఇతర విద్యుత్‌ ఉపకరణాలు వాడాల్సిన పని పడలేదు. వేసవిలో మాత్రమే చాలామంది ఏసీలు, ఎక్కువ మంది ఫ్యాన్లు వాడారు. కాబట్టి వేసవి మూడు నెలలు మినహా మిగతా రోజుల్లో కరెంట్‌ వాడకం తక్కువ. కానీ ఇప్పుడు ఎల్‌ నినో పరిస్థితుల్లో ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరుగుతోంది. అక్టోబర్‌ నెలలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా విద్యుత్‌ డిమాండ్‌ 20 వేల మెగావాట్లకు వెళ్ళినట్టు విద్యుత్‌ శాఖ తెలిపింది. కాగా అప్పుడు కరెంటు తక్కువ వినియోగమే అయ్యిందని, అయితే అప్పట్లో విద్యుత్‌ కొనుగోలుకు ఎక్కువ వ్యయం అయ్యిందని ఇప్పుడు ట్రూ అప్‌ చార్జీలు విధించడం ఏమిటని వినియోగదారులు ప్రశి్నస్తున్నారు.  

ఎవరో వాడితే మేం కట్టాలా? 
    కొత్తగా అద్దె ఇళ్ళల్లో దిగినవారు ఈ ట్రూ అప్‌ భారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ళ క్రితం ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఎవరో ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తే ఇప్పుడు మేం పొదుపుగా వాడినా పాతవాళ్ళు వాడిన విద్యుత్‌ భారం మోయాల్సి వస్తోందని పలువురు అంటున్నారు. కొన్ని అపార్ట్‌మెంట్లలో హాస్టళ్ళు, కోచింగ్‌ కేంద్రాలు నడుపుతున్నారు. అంతకు ముందు అదే బిల్డింగ్‌లో గృహావసరాల కోసమే విద్యుత్‌ వినియోగం జరిగింది. అయితే ఇప్పుడు ట్రూ అప్‌ వేయడంతో ఎక్కువ భారం పడుతోందని చెబుతున్నారు. యాజమాన్యాలు ఇదంతా ఆయా హాస్టళ్ళల్లో చదివే వాళ్ళపైనే మోపుతున్నాయి.  

ఇదెక్కడి అన్యాయం ? 
2022లో మాకు కరెంట్‌ బిల్లు కేవలం రూ. 500 వరకూ వచ్చేది. అప్పట్లో వాడకం తక్కువ. ఈ ఏడాది ప్రతీ నెల ఎండాకాలం మాదిరి ఉంది. దీంతో వాడకం పెరిగింది. అప్పట్లో తక్కువ వాడినా, ఇప్పుడు వాడిన ప్రతి యూనిట్‌పై చార్జీ వేస్తున్నారు. ఈ నెల బిల్లు అదనంగా రూ.480 వచి్చంది. 
– చాగలమర్రి సుదర్శన్‌ (వరంగల్‌) 

అప్పు చేసి పిండి మిల్లు పెట్టుకుంటే.. 
చిన్న పిండిమిల్లు మాది. ఈ మధ్యే పెట్టాం. అదీ అప్పు చేసి. మాకు గతంలో కరెంట్‌ వాడకమే తక్కువ. బతుకు దెరువు కోసం పెట్టిన మిల్లుకు విద్యుత్‌ బిల్లు ఎక్కువవుతోంది. మేం విద్యుత్‌ ఎక్కువగా వాడని కాలానికి సంబంధించిన చార్జీలు ఇప్పుడు వినియోగం పెరిగినప్పుడు విధించడం న్యాయమేనా? ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నాం.  
– ముప్పారపు సుజాత (ఖమ్మం)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement