కాళేశ్వరంపై అసెంబ్లీ | Special Assembly Sessions on Kaleshwaram: Telangana | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై అసెంబ్లీ

Nov 6 2026 5:01 AM | Updated on Nov 6 2026 5:01 AM

Special Assembly Sessions on Kaleshwaram: Telangana

మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి

శాసనసభ ప్రత్యేక భేటీకి కేబినెట్‌ నిర్ణయం

మేడిగడ్డ నుంచి నీటి తరలింపుపై బీఆర్‌ఎస్‌ ఆరోపణలను తిప్పికొట్టడానికే..

ఈ నెల చివరి వారంలో రెండురోజుల పాటు నిర్వహణ

ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు ప్రాజెక్టులు సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రులు మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించాలి

దేవాదుల, సీతారామను ఆయా జిల్లాల మంత్రులు పరిశీలించాలి

మేడిగడ్డలో నీటి తరలింపునకు ఉన్న ఆటంకాలు, దేవాదుల నుంచి రికార్డు స్థాయిలో గోదావరి జలాల తరలింపును ప్రజలకు వివరించనున్న మంత్రులు

పురపాలక శాఖలో 886 కొత్త పోస్టులకు కేబినెట్‌ ఓకే

19న సిద్దిపేటలో రూ. 5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమాకి శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ వద్ద నీటి లభ్యత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయడం లేదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి ఈ నెల చివరి వారంలో రెండు రోజుల పాటు రాష్ట్ర శాసన సభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టులను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయా జిల్లాల మంత్రులను ఆదేశించారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రులు కాళేశ్వ రం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించి అక్కడి నుంచి నీటి తరలింపునకు ఉన్న సాంకేతిక అడ్డంకులను పరిశీలించి చూడనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు సీతారామ ప్రాజెక్టు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మంత్రులు దేవాదుల ప్రాజెక్టును సందర్శించి అక్కడి నుంచి రికార్డు స్థాయిలో గోదావరి జలాలను తరలించిన అంశాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు. ఎల్‌ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర తాగు, సాగునీటి సంక్షోభం తరుముకొస్తున్న నేపథ్యంలో విపక్షాల దుష్ప్రచా రాన్ని తిప్పికొట్టి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికి ఈ మేరకు క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై చర్చించి ఆ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

19న సిద్దిపేటలో బహిరంగ సభ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్డీఎస్‌ఏ సిఫారసులను పాటిస్తూ పనులు చేపట్టాలని ఆదేశించింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించనుంది. 

రెండో దఫా ఇందిరమ్మ చీరల పంపిణీ
    రెండో దఫా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఇదే వేదికపై శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరిస్తాయి. తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేబినెట్‌ భేటీ తర్వాత సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. 

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి    
     దీపావళి సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన అన్ని ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇక వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు
     రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ యాక్ట్, 2003ను రద్దు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.

ఆర్డినెన్స్‌తో కొత్త అగ్నిమాపక చట్టం
    తెలంగాణ ఫైర్‌ సర్వీస్‌ యాక్ట్, 1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రమాదాలకు కారణాలను గుర్తించడం, వేగంగా స్పందించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారు.

‘సర్వే’ అప్పీళ్లపై గడువు 30 రోజులకు తగ్గింపు
    తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం, 1923లోని సెక్షన్‌ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్‌ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదనను ఓకే చేసింది.

న్యాయశాఖలో 136 పోస్టుల భర్తీ
    జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టు కోసం 56 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాలుగు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో  80 పోస్టుల మంజూరును ఓకే చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోని పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో కొత్తగా 886 పోస్టులను సృష్టించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన 7 ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వ అవసరాల కోసం వివిధ శాఖలకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement