2.73 లక్షల మంది రైతుల ఫోన్లకు అనధికార సందేశాలు
వ్యవసాయ శాఖకు సంబంధం లేదని డైరెక్టర్ స్పష్టీకరణ
సమగ్ర దర్యాప్తు కోరుతూ సైబర్ క్రైమ్ డీజీపీకి లేఖ
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నెట్‌వర్క్: రైతు భరోసా పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 2,73,128 మంది రైతుల మొబైల్ ఫోన్లకు అనధికార ఎస్‌ఎంఎస్‌లు చేరడం కలకలం రేపుతోంది. రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయాన్ని ఖాతాలో జమ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేరిట రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇది సమయం కూడా కాకపోవడంతో పలువురు బ్యాంకుల్లో ఆరా తీయగా.. ఎలాంటి నగదు జమ కాలేదని బయటపడింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లి, రాజేశ్వరపురం, పైనంపల్లి, నేలకొండపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతుల ఫోన్లకు బుధవారం మెసేజ్‌లు వచ్చాయి.
‘తెలంగాణ రైతాంగానికి నమస్కారం, రైతు భరోసా పథకంలో భాగంగా మన ప్రజా ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎకరాకు ఇచ్చే మొత్తం రూ.12 వేలకు పెంచింది. తదనుగుణంగా రూ.6,450 మీ బ్యాంకు ఖాతా నంబర్...లో జమ అయ్యాయి. ఈ సహాయం మీ వ్యవసాయం పెట్టుబడికి ఉపయోగపడుతున్నందుకు సంతోషిస్తున్నాను... మీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి’అని అందులో ఉండటంతో రైతులు కొందరు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తే తప్పుడు మెసేజ్ అని తేలింది. దీనిపై నేలకొండపల్లి మండల వ్యవసాయాధికారి ఎం.రాధ వివరణ కోరగా.. రైతు భరోసా నిధులకు సంబంధించి పలువురికి నకిలీ మెసేజ్‌లు అందినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఓటీపీలు చెప్పొద్దని సూచించారు.
అలాగే వేములవాడ కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల రైతులకు రైతుభరోసా పథకం ద్వారా ఖాతాలో జమైనట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఈ సందేశాలతో తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని వ్యవసాయ శాఖ స్పష్టంచేసింది. ప్రభుత్వ పథకం పేరుతో రైతులకు సందేశాలు పంపిన వారెవరు? ఏ ఉద్దేశంతో ఈ వ్యవహారానికి పాల్పడ్డారు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి సైబర్ క్రైమ్ విభాగం డీజీపీకి బుధవారం లేఖరాశారు. రైతులకు అధికారిక సమాచారం పంపేందుకు వ్యవసాయ శాఖ సీడాక్ ఎస్‌ఎంఎస్ సర్వీస్ పోర్టల్‌ను వినియోగిస్తోందని, అయితే ప్రస్తుతం రైతులకు చేరిన సందేశాలను తమ శాఖ పంపలేదని స్పష్టంచేశారు.
శాఖ పేరును లేదా ఎస్‌ఎంఎస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. సెండర్ ఐడీ, ట్రాన్స్‌మిషన్ లాగ్‌లు, ఐపీ అడ్రస్‌లు తదితర సాంకేతిక ఆధారాలను పరిశీలించి బాధ్యులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ పథకం పేరుతో ఇలాంటి అనధికార సందేశాలు పంపడం వల్ల రైతుల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా వ్యవసాయ శాఖ ప్రతిష్ట, రైతు భరోసా పథకం విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందని డైరెక్టర్ ఆందోళన వ్యక్తంచేశారు. లేఖ ప్రతులను వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శికి కూడా పంపించారు.


