రాజస్తాన్‌లో మార్బుల్ వ్యర్థాలతో తెల్లటి కొండలు
మినీ స్విట్జర్లాండ్‌గా సోషల్ మీడియాలో వైరల్
ఎగబడుతున్న టూరిస్టులు
కానీ.. ఆరోగ్య సమస్యలతో స్థానిక ప్రజల ఇబ్బందులు
కుదేలవుతున్న పర్యావరణం
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ రాజస్తాన్, ఇతర అధ్యయనాలలో ఆందోళనకర అంశాలు
సాక్షి, హైదరాబాద్: కెమెరా కంటికి అవి కశ్మీర్‌లా మెరిసే హిమగిరులు.. ఇన్‌స్ట్రాగామ్ రీల్స్‌కి అది ‘రాజస్తాన్ మినీ స్విట్జర్లాండ్’. కొత్త జంటలకు ఓ బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్. కానీ వాస్తవంలోకి తొంగి చూస్తే అది అభివృద్ధి మిగిల్చిన పర్యావరణ విషాదం! తెల్లటి పాలరాయి ధూళితో శ్వాస కోల్పోతున్న భూమి.. రసాయన నీటితో జీవం కోల్పోయిన నేల. రాజస్తాన్‌లోని కిషన్‌గఢ్ మార్బుల్ డంపింగ్ యార్డ్ అందాల వెనుక దాగి ఉన్న అసలు వ్యథ ఇది.
పాలరాయి వ్యర్థాలే.. మంచు కొండలుగా
భారతదేశంలోనే పెద్ద మార్బుల్ గ్రానైట్ ప్రాసెసింగ్ కేంద్రం కిషన్‌గఢ్. ఇక్కడ వేలాది పరిశ్రమల నుంచి వచ్చే పాలరాయి వ్యర్థాలను రోజూ సుమారు 1,000 ట్యాంకర్ల ద్వారా ఖాళీ స్థలంలో పడేస్తుంటారు. ఇలా ఏళ్లుగా పేరుకుపోయిన తెల్లటి మార్బుల్ పొడి (కాల్షియం కార్బోనేట్) పెద్ద మంచు కొండల మాదిరిగా తయారైంది. వర్షం నీరు ఆ పగుళ్లలో చేరి నీలిరంగు కృత్రిమ సరస్సులుగా ఏర్పడ్డాయి. ఎండకు తెల్లగా మెరిసే ఈ కొండలు, నీలిరంగు నీళ్లు అచ్చం కశ్మీర్ లేదా స్విట్జర్లాండ్ మాదిరిగా కనిపించడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో దీనిని ‘మినీ స్విట్జర్లాండ్’ లేదా ‘మూన్‌ల్యాండ్ ఆఫ్ రాజస్తాన్’ అని అభివర్ణిస్తూ, ప్రతిరోజూ వందల మంది ప్రీ–వెడ్డింగ్ షూట్‌లు, సినిమా షూటింగ్‌ల కోసం ఇక్కడకు చేరుకుంటున్నారు.
ప్రజలకు, పర్యావరణానికీ సమస్యలే..
బయటివాళ్లకు అది టూరిస్టు స్పాట్‌గా మారింది. కానీ గాలిలో తేలియాడే మార్బుల్ ధూళిని పీల్చడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆస్తమా, దగ్గు, ఛాతీ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, దంత సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ నిలిచిన పారిశ్రామిక వ్యర్థాల వల్ల భూగర్భ నీరు కలుషితమైంది. నీటిలో టీడీఎస్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయింది. వ్యవసాయ భూముల్లో ఈ తెల్లటి వ్యర్థపు పొడి పేరుకుపోయాయి. భూములు గట్టి పడి, పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
అధ్యయనాల్లో ఏం వెల్లడైంది?
» సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్, ఇతర పరిశోధనా సంస్థలు ఈ ప్రాంతాన్ని ‘టాక్సిక్ టూరిస్ట్ డెస్టినేషన్’ (విషపూరిత పర్యాటక ప్రాంతం)గా ప్రకటించాయి. ఈ అధ్యయనాలలో అనేక ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి.
» ఇక్కడి గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 2.5) సగటున క్యూబిక్ మీటరుకు జాతీయ ప్రమాణాల కంటే 8 రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితుల కంటే 20 నుంచి 50 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి.
» మార్బుల్ వ్యర్థాల్లో ‘ట్రెమోలైట్ ఆస్బెస్టాస్’ వంటి ప్రమాదకరమైన క్యాన్సర్ కారక ఫైబర్లు ఉన్నాయి.
» మట్టి నమూనాలలో ఫ్లోరైడ్, కాపర్, జింక్, నికెల్ వంటి భారీ లోహాలు పేరుకుపోయినట్లు గుర్తించారు. ఇవి భూగర్భ జలాల్లోకి చేరి నీటి సెలైనిటీ(ఉప్పుదనం) కాఠిన్యతను విపరీతంగా పెంచేశాయి.
ఎన్‌జీటీ అభ్యంతరాలు.. ఆదేశాలు
ఈ అనధికార డంపింగ్ కారణంగా కలిగే పర్యావరణ ముప్పుపై పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. విచారించిన ట్రిబ్యునల్.. స్థానిక యంత్రాంగం పొల్యూషన్ రూల్స్ పాటించడం లేదని మండిపడింది. ఈ 82 ఎకరాల డంపింగ్ యార్డ్‌లో ఎలాంటి ’ఇంజనీర్డ్ లైనర్ సిస్టమ్’(భూమిలోకి కెమికల్స్ ఇంకకుండా చూసే పొర), డస్ట్ సప్రెషన్(దుమ్ము అణిచివేసే వ్యవస్థ), చుట్టూ గ్రీన్ బెల్ట్(చెట్ల పెంపకం) లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించని మార్బుల్ యూనిట్లపై చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ పెంచాలని ఎన్‌జీటీ ఆదేశించింది. దీంతో ఇప్పుడిప్పుడే అక్కడ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది.


