త్వరలో పెళ్లి.. హోటల్‌ రూమ్‌ నం.302లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి | Room number 302 and a bathtub How did a UK engineer end life | Sakshi
Sakshi News home page

త్వరలో పెళ్లి.. హోటల్‌ రూమ్‌ నం.302లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Nov 4 2026 10:30 PM | Updated on Nov 4 2026 10:30 PM

 Room number 302 and a bathtub How did a UK engineer end life

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాంజిల్ పాఠక్ (35) గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. హోటల్ గదిలోని జకూజీలో ఆయన విగతజీవిగా కనిపించారు. త్వరలోనే పెళ్లి జరగాల్సి ఉండటంతో ఆగ్రాలోని కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రాంజిల్ పాఠక్ యూకేలోని మాంచెస్టర్‌లో ఓ బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన భారత్‌కు వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో స్నేహితులతో కలిసి సెలవులు గడిపారు. అనంతరం సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన స్నేహితుడిని విమానం ఎక్కించిన తర్వాత గురుగ్రామ్‌కు వెళ్లారు. రాత్రి అక్కడే ఉండేందుకు సెక్టార్-53లోని ఓరసమ్ హోటల్‌లో గది బుక్ చేసుకున్నారు. హోటల్‌లోని 302వ గదిలో బస చేశారు.

రాత్రి 8 గంటల సమయంలో హోటల్ సిబ్బందికి ఏదో అనర్థం జరిగి ఉంటుందనే అనుమానం వచ్చింది. దీంతో గది తలుపు తెరిచి చూడగా, బాత్రూమ్‌లోని జకూజీ నీటిలో ప్రాంజిల్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వైద్యుడిని పిలిపించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న సెక్టార్-53 పోలీసులు హోటల్‌కు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించి గదిలో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

పోలీసులు హోటల్‌లోని నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మూడో అంతస్తుతో పాటు హోటల్ ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ఉన్న కెమెరాల రికార్డులను తనిఖీ చేశారు. ప్రాంజిల్ గదిలోకి వెళ్లిన తర్వాత మరో వ్యక్తి అక్కడికి వచ్చినట్లు దృశ్యాల్లో కనిపించలేదని పోలీసులు తెలిపారు. గది లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని కూడా గుర్తించారు.

జకూజీలో స్నానం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడం, కాలు జారి పడిపోవడం లేదా నీటిలో మునిగి ఊపిరాడకపోవడం వంటి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మరణానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం తేలనుంది.

ప్రాంజిల్‌కు త్వరలో వివాహం జరగాల్సి ఉంది. ఆగ్రాలో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. సెలవుల కోసం భారత్‌కు వచ్చిన ఆయన హఠాత్తుగా మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement