పుస్తక పఠనంలో జెన్‌జీ కొత్త పుంతలు
నేషనల్ బుక్ ట్రస్ట్ నివేదికలో వెల్లడి
సాక్షి, స్పెషల్ డెస్క్: డిజిటల్ స్క్రీన్లకు బందీ అయిపోతుందనుకున్న జెన్ జీ యువతరం.. ఊహించని రీతిలో మళ్లీ పుస్తకాల వైపు అడుగులేస్తోంది. అందులోనూ రెగ్యులర్ బుక్స్ కాకుండా ఆలోచనలకు పదునుపెట్టే, సమకాలీన సామాజిక వాస్తవాలను చర్చించే పుస్తక పఠనానికి పెద్దపీట వేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సైకలాజికల్ థ్రిల్లర్లు, కొరియన్–జపనీస్ ఫిక్షన్ అనువాదాలతోపాటు అంబేడ్కర్–కబీర్ తాత్విక గ్రంథాలనూ అక్కున చేర్చుకుంటోంది. న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన–2026 సందర్శకులపై నిర్వహించిన శాంపిల్ సర్వే ఆధారంగా నేషనల్ బుక్ ట్రస్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బుక్ మేళాను 20 లక్షల మందికిపైగా సందర్శించగా, అందులో 40 శాతం మంది కాలేజీ విద్యార్థులే కావడం విశేషం.
కాలక్షేపం కాదు.. ఆలోచనల అన్వేషణ
మానసిక భావోద్వేగాలను శోధించే సైకలాజికల్ థ్రిల్లర్లు, అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచినకాల్పనిక సాహిత్యానికి యువత ప్రాధాన్యం ఇస్తోంది. అలెక్స్ మైఖేలిడిస్ రచించిన ‘ది సైలెంట్ పేషెంట్’, రెబెక్కా ఎఫ్.కువాంగ్ రాసిన ‘ఎల్లోఫేస్’, చిత్ర బెనర్జీ దివాకరుని రచించిన ‘ది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్’ వంటి పుస్తకాలు బెస్ట్‌సెల్లర్లుగా నిలిచాయి. బుకర్ ప్రైజ్ గ్రహీత హాన్ కాంగ్ రాసిన ‘ది వెజిటేరియన్’, బోరా చుంగ్ ‘కర్స్‌డ్ బన్నీ’, తోషికాజు కవాగుచి ‘బిఫోర్ ది కాఫీ గెట్స్ కోల్డ్’, సతోషి యగిసావా ‘డేస్ ఎట్ ది మోరిసాకి బుక్‌షాప్’ పుస్తకాలను యువత పోటీపడి కొనుగోలు చేసింది.
ప్రపంచ పోకడలపై యువతకున్న విస్తృత ఆసక్తి, విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవాలనే తపనకు ఇది నిదర్శనమని ఎన్‌బీటీ పేర్కొంది. హిందీ విభాగంలో సంత్ కబీర్ కవిత్వం, డాక్టర్ అంబేడ్కర్ రచనలు, ఓషో పుస్తకాలు, వ్యక్తిత్వ వికాస సాహిత్యం, భారత రాజ్యాంగ అనువాద ప్రతులు అధికంగా అమ్ముడయ్యాయి. యువత పుస్తకాలను ఎంపిక చేసుకునే విధానం కేవలం కాలక్షేపానికే కాకుండా.. తమ అస్థిత్వం, సమాజంలో తమ పాత్ర, వర్తమాన సామాజిక సమస్యల ఆధారంగానే ప్రధానంగా సాగుతోంది.
ప్రాంతీయ భాషా ప్రచురణల కొరత
పుస్తక ప్రదర్శనలో 352 ఆంగ్ల ప్రచురణ సంస్థలు, 156 హిందీ పబ్లిషర్లు పాల్గొనగా, ఉర్దూ నుంచి 24 మంది మాత్రమే హాజరయ్యారు. ఇతర ప్రాంతీయ భాషల ప్రచురణకర్తల భాగస్వామ్యం అత్యంత స్వల్పంగా ఉంది. ప్రాంతీయ భాషా పుస్తకాలపై యువతలో ఆసక్తి పెరుగుతున్నప్పటికీ తగినన్ని ప్రచురణలు అందుబాటులో ఉండట్లేదు. మార్కెట్‌లో సరైన ప్రచారం కొరవడటం వల్ల ప్రాంతీయ భాషా ప్రచురణల విక్రయాలు తక్కువ స్థాయికే పరిమితమవుతున్నాయని నివేదిక విచారం వ్యక్తం చేసింది.


