2026 ఏడాది పదంగా ‘మొగ్గింగ్’.. అర్థం ఇదే.. | Mogging named Collins Dictionary's 2026 word of the year | Sakshi
Sakshi News home page

2026 ఏడాది పదంగా ‘మొగ్గింగ్’.. అర్థం ఇదే..

Nov 4 2026 10:44 AM | Updated on Nov 4 2026 10:56 AM

Mogging named Collins Dictionary's 2026 word of the year

లండన్‌: 2026 సంవత్సరానికి సంబంధించి కొలిన్స్ డిక్షనరీ తన ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ‘మొగ్గింగ్’ (Mogging) అనే పదాన్ని ఎంపిక చేసింది. ఇతరులను మించిపోవడం, వారి కంటే మెరుగ్గా రాణించడం లేదా తమ ప్రతిభతో ఇతరులను అధిగమించడాన్ని ఈ పదంతో సూచిస్తారు. ఈ ఏడాది ఈ పదం వినియోగం ఏకంగా 210 శాతం పెరిగినట్లు డిక్షనరీ వెల్లడించింది.

కొలిన్స్ డిక్షనరీ నిపుణులు 27 బిలియన్ పదాలతో కూడిన కొలిన్స్ కార్పస్‌ (Collins Corpus)ను పరిశీలించి ఏటా కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలను గుర్తిస్తారు. సామాజిక మాధ్యమాలు సహా వివిధ మీడియా వేదికల్లో పదాల వినియోగాన్ని విశ్లేషించి ఈ జాబితాను రూపొందిస్తారు. ఈ ఏడాది జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా యువత ‘మొగ్గింగ్’ పదాన్ని హాస్యభరితమైన యాసగా (Humorous Slang) విస్తృతంగా ఉపయోగిస్తున్నారని కొలిన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలెక్స్ బీక్రాఫ్ట్ తెలిపారు. ప్రతి తరం భాషపై తనదైన ముద్ర వేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

ఇతర పదాలు.. వాటి అర్థాలు
ఈ ఏడాది కొలిన్స్ డిక్షనరీ గుర్తించిన ఇతర పదాల్లో బిక్సీ , కార్‌స్ప్రెడింగ్, ఫైర్‌వేవ్, ఫ్రైసీ, ఫ్రెండ్‌స్లాప్, ఘోస్ట్‌జాబ్, హైడ్రేషన్ బ్రేక్, మాంచెస్టరిజం, పీ (డూమ్) ఉన్నాయి.

బిక్సీ (Bixie): బాబ్ కట్ కంటే పొట్టిగా, పిక్సీ కట్ కంటే పొడవుగా ఉండే జుట్టు అలంకరణ.

కార్‌స్ప్రెడింగ్ (Carspreading): కార్ల తయారీ సంస్థలు వాహనాలను మరింత పొడవుగా, వెడల్పుగా, బరువుగా రూపొందించే ధోరణి.

ఫైర్‌వేవ్ (Firewave): తక్కువ వ్యవధిలో వరుసగా సంభవించే పట్టణ ప్రాంత అగ్నిప్రమాదాలు.

ఫ్రైసీ (Fricy): పండ్ల రుచి, ఘాటైన మసాలా రుచి రెండూ కలిసిన ఆహార పదార్థం.

ఫ్రెండ్‌స్లాప్ (Friendslop): స్నేహితులు కలిసి ఆడుకునే తక్కువ బడ్జెట్‌తో స్వతంత్రంగా రూపొందించిన వీడియో గేమ్.

ఘోస్ట్‌జాబ్ (Ghostjob): ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశం లేకుండానే ప్రకటించే ఉద్యోగ ఖాళీ.

హైడ్రేషన్ బ్రేక్ (Hydration Break): క్రీడా పోటీల మధ్య ఆటగాళ్లు నీరు లేదా ఇతర ద్రవాలు తాగేందుకు ఇచ్చే విరామం.

మాంచెస్టరిజం (Manchesterism): ప్రాంతాలకు అధికారాలను బదిలీ చేస్తూ ఆర్థిక, సామాజిక పురోగతికి ప్రాధాన్యమిచ్చే రాజకీయ విధానం.

పీ (డూమ్) (P(Doom)): కృత్రిమ మేధస్సు(ఏఐ) మానవ నాగరికత పతనానికి దారితీసే అవకాశంపై వేసే అంచనా

యువత తమదైన శైలిలో కొత్త పదాలను సృష్టించి, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారు. ఈ పరిణామం భాష నిరంతరం మారుతూ, కొత్త తరాల ప్రభావంతో అభివృద్ధి చెందుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తోందని కొలిన్స్ డిక్షనరీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ‘మొగ్గింగ్’ పదానికి లభించిన గుర్తింపు యువత యాసకు భాషా ప్రపంచంలో పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement