వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు పియా దాండియా ఘన విజయం సాధించారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కేసీ అస్కర్‌పై విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మొత్తం ఓట్లలో పియా దండియాకు 51.9 శాతం, కేసీ అస్కర్‌కు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.
ఫ్లోరిడా నుంచి తొలి భారతీయ అమెరికన్‌గా..
ఈ విజయంతో ఫ్లోరిడా నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా పియా దాండియా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అమెరికా కాంగ్రెస్‌లో అడుగుపెట్టిన పదో భారతీయ అమెరికన్‌గా నిలిచారు. తొలుత ఫ్లోరిడాలోని 21వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ నేత బ్రియాన్ మాస్ట్‌పై పోటీ చేయాలని పియా భావించారు. అయితే ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుని 22వ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ స్థానంలో సిట్టింగ్ సభ్యుడు పోటీలో లేకపోవడం ఆమెకు మరో అవకాశంగా మారింది. డెమొక్రాట్లకు అత్యంత కీలకమైన ఈ స్థానాన్ని పియా తమ పార్టీ ఖాతాలో వేసుకున్నారని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ పేర్కొన్నారు.
28 ఏళ్లకే పాఠశాల ప్రిన్సిపల్
పామ్ బీచ్ కౌంటీలో పుట్టి పెరిగిన పియా దాండియా తొలుత ఉపాధ్యాయురాలిగా తన కెరీర్ ప్రారంభించారు. అనంతరం న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్య, ఆర్థిక స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో ఓ పాఠశాలను స్థాపించారు. కేవలం 28 ఏళ్ల వయసులోనే ఆ పాఠశాలకు వ్యవస్థాపక ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన ప్రిన్సిపల్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు.
పేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు
పియా స్థాపించిన పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థికీ కాలేజీలో ప్రవేశం లభించినట్లు ఆమె ప్రచార వెబ్‌సైట్ వెల్లడించింది. ఆ పాఠశాలలో 86 శాతం మంది విద్యార్థులు తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారే కావడం విశేషం. విద్యా రంగంతో పాటు విధాన రూపకల్పన, సాంకేతిక రంగాల్లోనూ ఆమె పనిచేశారు. సమాజ అభివృద్ధికి తన వృత్తి జీవితాన్ని అంకితం చేసినట్లు ఆమె ప్రచార వెబ్‌సైట్ పేర్కొంది.
వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం మరోసారి విజయం
మరోవైపు భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ నేత సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియాలోని 10వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌పై ఆయన విజయం సాధించారు. సుహాస్‌కు 61.5 శాతానికి పైగా ఓట్లు రాగా, ప్రత్యర్థికి 36.4 శాతం ఓట్లు వచ్చాయి. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో సుహాస్ సాంకేతిక విధాన సలహాదారుగా పనిచేశారు. న్యాయవిద్య పూర్తి చేసిన అనంతరం వైట్‌హౌస్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికై, రెండు పర్యాయాలు సేవలందించారు. 2024లో తొలిసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: జార్జియాలో మళ్లీ జాన్ ఒస్సాఫ్.. ట్రంప్‌ను బలంగా ఢీకొని..


