వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి డెమోక్రాట్లు గట్టి పోటీ ఇస్తున్నారు. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ డెమోక్రాట్లు తొలి ఆధిక్యాలు సాధిస్తున్నారు. జార్జియాలో జాన్ ఒసాఫ్ మరోసారి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఫ్లోరిడాలో కాథీ కాస్టర్, జారెడ్ మోస్కోవిట్జ్, పియా దండియా విజయం సాధించారు. మేరీల్యాండ్ గవర్నర్‌గా వెస్ మూర్, పెన్సిల్వేనియా గవర్నర్‌గా జోష్ షాపిరో తిరిగి ఎన్నికయ్యారు. రోడ్ ఐలాండ్‌లో జాక్ రీడ్, డెలావేర్‌లో క్రిస్ కూన్స్ సెనేట్ స్థానాలను నిలబెట్టుకున్నారు. వర్జీనియాలో డెమోక్రటిక్ సెనేటర్ మార్క్ వార్నర్ కూడా నాలుగోసారి విజయం సాధించినట్లు ఫాక్స్ న్యూస్ అంచనా వేసింది.
అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 45 స్థానాలు ఉండగా.. ఇద్దరు స్వతంత్ర సభ్యులున్నారు. మరోవైపు ప్రతినిధుల సభలో మెజారిటీకి 218 స్థానాలు అవసరం. డెమోక్రాట్లు తిరిగి అధికారాన్ని దక్కించుకుంటారనే ఆశాభావాన్ని ఆ పార్టీ నేత హకీమ్ జెఫ్రీస్ వ్యక్తం చేశారు.
ట్రంప్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని తొలి ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి. దాదాపు 70 శాతం మంది దేశం ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్నట్లు, 40 శాతం మంది ఆగ్రహంతో ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులు, జీవన వ్యయం, వలస విధానాలు, విదేశాంగ విధానం, ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి.
మరోవైపు ఇండియానాలో వెలువడిన తొలి ఫలితాలు డెమోక్రాట్లకు ఆశలు కలిగిస్తున్నాయి. రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లోనూ డెమోక్రటిక్ అభ్యర్థులు మెరుగైన ఓట్ల శాతాన్ని సాధిస్తున్నారు. అయితే ఇవి ప్రారంభ ఫలితాలు మాత్రమే కావడంతో తుది ఫలితాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు.


