ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైఫ్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రట్స్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ మరికొన్ని ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా పలువురు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది.
ఇందులో.. డొనాల్డ్ ట్రంప్ కొంత మంది అమ్మాయిలతో(వాళ్ల మఖాల బ్లర్ చేసి ఉన్నాయి) కలిసి దిగిన ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. మరొక ఫొటోలో ఎప్‌స్టీన్‌తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫొటోలో ఒక అమ్మాయితో(ముఖం కనిపించకుండా చేశారు) కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారాయన. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. వీటితో పాటు క్లింటన్ ఎప్‌స్టీన్‌తో దిగిన ఫొటోలు, ఎప్‌స్టీన్ ఎస్టేట్‌లో బిల్‌గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు ఉన్నాయి.

ట్రంప్.. ఎప్‌స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. అయితే లైంగిక దాడి కేసులో ఎప్‌స్టీన్ అరెస్ట్(2004) తర్వాత ఆ బంధానికి ఎండ్‌కార్డ్ పడింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు.


బానన్‌తో ఎప్‌స్టీన్ సెల్ఫీ.. పక్కన ఐల్యాండ్‌లోని ఓ గోడ మీద ఫొటోలో బిల్‌గేట్స్
తాజాగా రిలీజ్ అయిన ఫొటోలు.. పలు ఈవెంట్లలో, పిచ్చాపాటి సంభాషణల్లో దిగిన ఫొటోలే ఉన్నాయి. అంతేగానీ.. అందులో ఉన్నవాళ్లంతా ఎప్‌స్టీన్ పాపాల్లో భాగం అయినట్లు మాత్రం ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫొటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని అన్నారు.
‘‘నేను వాటిని చూడలేదు. కానీ అందరికీ ఈ వ్యక్తి(బానోన్‌ను ఉద్దేశిస్తూ..) తెలుసు. అతను పామ్ బీచ్‌లో ఎక్కడైనా కనిపించేవాడు. అతనితో వందలాది మంది ఫోటోలు ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’’ అంటూ బదులిచ్చారు.
🇺🇸⚡️Reporter: There were new Epstein photos released today showing..What was your reaction?
Trump: I haven't seen them, but everybody knew this man (Bannon). He was all over Palm Beach. There are 100s and 100s of people that have photos with him. I know nothing about it. pic.twitter.com/KKWGtyr4Q2— Osint World (@OsiOsint1) December 12, 2025
కామ పిశాచి.. ఎప్‌స్టీన్!
అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్‌స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు.
ఎప్‌స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు).
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో..
మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్‌స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..
ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ ఏడాది జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్‌స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్‌మెయిల్ చేయలేదని.. సన్నిహితంగా ఉన్న ప్రమఖలపైనా నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..
ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్‌స్టీన్‌పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్‌స్టీన్ అరెస్టయ్యాడు కూడా).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో..
ఇది డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు.. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌజ్ ఓవర్‌సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఎప్‌స్టీన్ ప్రైవేట్ ల్యాండ్స్‌కు సంబంధించి.. అందులో ఉన్న 150 ఫొటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్‌స్టీన్‌కు ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈ-మెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్‌తో ఎప్‌స్టీన్ చేసిన ఈ-మెయిల్‌లు, అలాగే ట్రంప్ మాజీ సలహాదారు బానన్‌కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి.
అంతేకాదు ఐల్యాండ్‌లోని విలాసవంతమైన వసతుల ఫొటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మరోపక్క.. గిస్లేన్ మాక్స్‌వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి, కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


