వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
సైనిక స్థావరాలు ధ్వంసం
‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హోర్ముజ్ జలసంధిపై హెచ్చరిక
వ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!


