కుప్పకూలిన రీఫ్యూయలింగ్‌ విమానం | US refueling aircraft crashes in western Iraq | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన రీఫ్యూయలింగ్‌ విమానం

Mar 14 2026 2:06 AM | Updated on Mar 14 2026 2:06 AM

US refueling aircraft crashes in western Iraq

ఆరుగురు సిబ్బంది మృతి

పశ్చిమ ఇరాక్‌లో దుర్ఘటన 

శత్రువుల దాడి, ఫ్రెండ్లీ ఫైర్‌ కాదన్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ 

రెండు విమానాలు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయని వెల్లడి 

మరొకటి ఇజ్రాయెల్‌లో క్షేమంగా ల్యాండైనట్లు స్పష్టీకరణ 

దుబాయ్‌: పశ్చిమాసియాలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లుతోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన కేసీ–135 రీఫ్యూయలింగ్‌ విమానం పశ్చిమ ఇరాక్‌లో గురువారం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మొత్తం ఆరుగురు సిబ్బంది మరణించారు. యూఎస్‌ మిలటరీ సెంట్రల్‌ కమాండ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయం నిర్ధారించింది. విమానం కూలిపోవడానికి శత్రువుల దాడి గానీ, ఫ్రెండ్లీ ఫైర్‌ గానీ కారణంగా కాదని తేల్చిచెప్పింది. రెండు కేసీ–135 విమానాలు పక్కపక్కనే ప్రయాణిస్తూ ప్రమాదవవశాత్తూ పరస్పరం ఢీకొన్నాయని తెలియజేసింది.

వాటిలో ఒకటి కూలిపోగా, మరొకటి స్వల్పంగా దెబ్బతిని ఇజ్రాయెల్‌లో క్షేమంగా ల్యాండైనట్లు స్పష్టంచేసింది.  పశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొంటున్న తమ సైన్యానికి మద్దతుగా ఈ విమానాలను అమెరికా రంగంలోకి దించినట్లు సమాచారం. అయితే, పశ్చిమ ఇరాక్‌లో యూఎస్‌ కేసీ–135 ఎయిర్‌క్రాఫ్ట్‌ను తామే కూల్చేశామని ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరించే ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ రెబల్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఖండించింది.

ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియాలో అమెరికా విమానాలు కూలిపోవడం ఇది నాలుగోసారి. కేసీ–135 రీఫ్యూయలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను గగనతలంలో యుద్ధ విమానాల్లో ఇంధనం నింపడానికి ఉపయోగిస్తారు. ఇదొక భారీ చమురు ట్యాంకర్‌ అని చెప్పొచ్చు. కేసీ–135 స్ట్రాటోట్యాంకర్‌ అని పిలుస్తుంటారు. కేవలం చమురు నింపడానికే కాకుండా, సైనిక ఆపరేషన్లలో గాయపడిన జవాన్లను చికిత్స కోసం తరలించడానికి వాడుతుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement