అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రట్లు మరోసారి పైచేయి సాధించారు. డిటెన్షన్ సెంటర్ల విషయంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ వాషింగ్టన్ డీసీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఆరు నెలలుగా ఈ విషయంలో డెమొక్రట్లు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికా చట్ట సభ్యులు ఎవరైనా సరే గతంలో డిటెన్షన్ సెంటర్లకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి సందర్శించే వీలుండేది. అయితే ట్రంప్(Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ సందర్శనలపై ఆంక్షలు విధించారు. ‘‘వారం ముందుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు(ICE) సెంటర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీల్డ్ ఆఫీసులు అనుమతి ఇస్తేనే సందర్శించొచ్చు. లేకుంటే లేదు’’ అనే ఉత్తర్వులు తీసుకొచ్చారు. అయితే.. ఈ ఉత్తర్వులపై హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లోని డెమొక్రట్లు కోర్టును ఆశ్రయించారు.
ట్రంప్ 2.0లో ఎంతటి కఠిన వైఖరి అవలంభిస్తున్నది చూస్తున్నదే. మరీ ముఖ్యంగా వలసవాదుల విషయంలో ఆయన ధోరణి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో.. డిటెన్షన్ సెంటర్‌లలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని డెమొక్రట్లు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. సరైన వసతులు ఉండడం లేదని.. అక్కడి వాళ్లను దారుణంగా చూస్తున్నారని.. ఈ తరుణంలో అలాంటివేవీ బయట పడకుండా ఉండేందుకే ట్రంప్ ఈ ఉత్తర్వులు తెచ్చారన్నది డెమొక్రట్ల వాదన. అయితే..
ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఆ వాదనను ఖండించింది. చట్ట సభ్యుల భద్రత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో.. డెమొక్రట్ల వాదనలతో ఏకీభవించిన ఫెడరల్ జడ్జి జియా కాబ్ ట్రంప్ ఉత్తర్వులను ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని ప్రకటిస్తూ.. వాటిని పక్కన పెడుతూ తీర్పు ఇచ్చారు. జియా కాబ్ గత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో నియమించబడ్డారు.
ఇదిలా ఉంటే.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించే హక్కు కల్పించే ఫెడరల్ చట్టాన్ని తెచ్చింది ట్రంపే కావడం గమనార్హం. ట్రంప్ మొదటి దఫా అధ్యక్ష పదవీ కాలంలో ఈ చట్టం ఆమోదించబడింది.
ఇదిలా ఉంటే.. న్యూజెర్సీ డెమొక్రటిక్ ప్రతినిధి లమోనికా మెకైవర్ ఈ ఏడాది మే నెలలో న్యూయార్క్‌లోని ఓ డిటెన్షన్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే ఆ సమయంలో డిసెన్షన్ సెంటర్‌లో పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆమెపై కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆమె మండిపడ్డారు. ఈ ఘటన జరిగిన నెలలోపే ట్రంప్ చట్ట సభ్యుల ఆకస్మిక సందర్శనలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: ఇక పూర్తిస్థాయి యుద్ధమేనా ట్రంప్?


