పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గాజాలో శాంతిస్థాపనకు ముస్లిం దేశాలు అక్కడ సైనిక దళాలలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్ ఆవిషయమై యుఎస్ అధ్యక్షుడితో చర్చించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా మధ్య సంబంధాలు బలీయంగా ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్లతో ఇటీవల తరచుగా భేటీలు జరుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ట్రంప్ ఎఫ్-16 యుద్ధవిమానాల అప్గ్రేడ్ కోసం పాకిస్థాన్కు ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేశారు. ఈ చర్య భారత్ను కలవరపాటుకు గురిచేసింది. అనంతరం కూడా భారత్పై పలు రకాల ఆంక్షలు విధించి అదే సమయంలో పాకిస్థాన్కు దగ్గరయ్యే యత్నం ట్రంప్ చేశారు.
కాగా ఇటీవల గాజాలో శాంతిస్థాపన కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ముస్లిం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు తమ దేశ సైనిక దళాలను గాజాలో మెుహరించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయమై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పాకిస్థాన్లో వ్యతిరేకత ఎదురవుతుంది. అక్కడి ప్రజలు ఆదేశ సైనికులను గాజా పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఒకవేళ ఈ డీల్కు అంగీకరిస్తే సొంత దేశంలో వ్యతిరేకత, అంగీకరించకుంటే అమెరికా అధ్యక్షుడి ఆగ్రహాం మెుత్తానికి ఆసిమ్ మునీర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన ఉంది. ఈ డీల్కు టర్కీ, ఈజిప్టు, జోర్దాన్ దేశాలు మద్దుతిస్తున్నాయి. ఇరాన్ మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఆ విషయమై గత నెలలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. గాజాలో సైనిక దళాల మెుహరింపు విషయం ఆలోచిస్తామన్నారు. అయితే హామాస్ని నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు.


