వాషింగ్టన్: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. 2021లో కేపిటల్ హిల్ దాడి సమయంలో తన ప్రసంగాన్ని దురుద్దేశంతో తప్పుగా, రెచ్చగొట్టేవిధంగా బీబీసీ ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. అందుకుగాను సంస్థ 10 బిలియన్ డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోవడానికి, ప్రభావితం చేయడానికి ప్రయతి్నంచిందన్నారు. ఈ మేరకు 33 పేజీలతో మయామి ఫెడరల్ కోర్టులో దావాను వేశారు.
2021 జనవరి 6న తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో కేపిటల్ హిల్‌పై దాడికి ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ గంటపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ‘కేపిటల్ హిల్‌కు వెళ్తున్నాం. నేనూ మీతోపాటు వస్తున్నాం. మనం పోరాడదాం’అన్నట్టుగా ఉన్న ప్రసంగాన్ని బీబీసీ ‘పనోరమ’డాక్యుమెంటరీగా ప్రసారం చేసింది. అయితే రెండు వేర్వేరు భాగాలను ఎడిట్ చేసి, కలిపి ప్రసారం చేశారని ట్రంప్ ఆరోపించారు. తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లుగా ప్రసారం చేసినందుకు బీబీసీపై దావా వేస్తున్నట్లు చెప్పారు.


