బెర్లిన్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే ప్రయత్నాల్లో అతి పెద్ద ముందడుగు. అమెరికా, యూరప్ దేశాలతో కుడిన నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరికను అనుమతించే విషయమై యోచిస్తున్నట్టు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జర్మనీలో చర్చలు జరుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూతల బృందం సోమవారం ఈ మేరకు పేర్కొంది. రష్యా వర్గాల నుంచి తమకు ఈ మేరకు వర్తమానం వచ్చినట్టు తెలిపింది.
నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. అలాంటి ప్రయత్నం చేస్తే మొత్తం యూరప్ నే తమ శత్రువుగా భావించి వారితో నేరుగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు, అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ భద్రతకు కచ్చితమైన హామీలిస్తే నాటోలో చేరిక డిమాండ్ ను శాశ్వతంగా వదులుకుంటామని జెలెన్ స్కీ ఆదివారమే ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయమై రష్యా వైఖరి ఇలా అనూహ్యంగా మారడం విశేషం!


