వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్ తాలూకు విపరిణామాలకు మరో తాజా తార్కాణం. గత నవంబర్ ప్రపంచవ్యాప్తంగా పెద్దగా చలి జాడలు లేకుండానే గడచిపోయింది. అంతేనా, చరిత్రలో అత్యంత వేడిని చవిచూసిన నవంబర్ మాసాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) ఈ మేరకు చేదు వాస్తవాన్ని వెల్లడించింది.
నవంబర్‌లో సగటు భూ ఉపరితల వాయు ఉష్ణోగ్రత 14.02 డిగ్రీ సెంటీగ్రేడ్ గా నమోదైంది. 1991–2020 నడుమ నమోదైన నవంబర్ సగటు కంటే ఇది ఏకంగా 0.65 డిగ్రీ అదనం! అత్యంత వేడిమి నవంబర్లుగా రికార్డులకెక్కిన 2023 కంటే 0.2 డిగ్రీలు, 2024 కంటే కేవలం 0.08 డిగ్రీలే తక్కువ. ఇక పారిశ్రామికీకరణ (1850–1900)కు ముందునాటితో పోలిస్తే ఏకంగా 1.54 డిగ్రీలు ఎక్కువ! ఈ విషయంలో అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీల పరిమితిని కూడా ఈ నవంబర్ దాటేసింది.
2025లో తొలి 11 నెలల సంగతి చూసుకున్నా 1.48 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ లెక్కన 2025 కూడా చరిత్రలోనే అత్యంత వేడిమిమయమైన సంవత్సరాల జాబితాలో రెండు, లేదా మూడో స్థానంలో నిలవడం ఖాయమేనని సైంటిస్టులు (Scientists) అంటున్నారు.
ఎంత భారీ తేడాలో!
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత (Temperature) పెరుగుదలలో కూడా భీతి కలిగించే ఒక పరిణామాన్ని సైంటిస్టులు గమనించారు. ధ్రువ ప్రాంతాల్లో ఈ పెరుగుదల మరీ ఎక్కువగా నమోదైంది. ఆర్కిటిక్ లోని ఉత్తర కెనడా, ఆర్కిటిక్ మహాసముద్రం, పశ్చిమ రష్యా సగటు కంటే ఏకంగా 5 నుంచి 7 డిగ్రీలు ఎక్కువ వేడెక్కాయి.
చదవండి: సంచలన విజయం.. ఎవరీ 'రైడ్ శ్రీలేఖ'?


