ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి  | Automakers extend sales surge beyond festive season in November | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి 

Dec 14 2025 6:18 AM | Updated on Dec 14 2025 6:18 AM

Automakers extend sales surge beyond festive season in November

వాహన తయారీదారుల సంఘం సియామ్‌ వెల్లడి  

ముంబై: పండగ సీజన్‌ తర్వాత కూడా ప్యాసింజర్‌ వాహనాలకు (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) డిమాండ్‌ కొనసాగింది. ఈ నవంబర్‌లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,12,405 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే నవంబర్‌లో సరఫరా 3,47,522తో పోలిస్తే ఇది 19% అధికంగా ఉందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్‌ తెలిపింది. కార్ల తయారీ అగ్రగామి మారుతీ సుజుకీ సరఫరా 1,41,312 నుంచి 21 % పెరిగి 1,70,971 యూనిట్లకు చేరింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 56,336 యూనిట్లను సరఫరా చేసింది. ఇదే నవంబర్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా డీలర్లకు 50,340 యూనిట్లను పంపిణీ చేసింది. 

 
∙ద్వి చక్రవాహనాల పంపిణీలో 21% వృద్ధి నమోదైంది. ఈ నవంబర్‌లో మొత్తం సరఫరా 16,04,749 యూనిట్ల నుంచి 19,44,475 చేరింది. మోటార్‌సైకిల్‌ విభాగంలో 11,63,751 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 7,35,753 యూనిట్ల సరఫరా జరిగింది. అయితే మోపెడ్‌ సిగ్మెంట్‌లో 2% క్షీణత నమోదైంది. మొత్తం 45,923 యూనిట్ల నుంచి 44,971 యూనిట్లకు పరిమితమయ్యాయి. త్రీ వీలర్స్‌ అమ్మకాలు 21% వృద్ధితో 71,999 యూనిట్లుగా నమోదయ్యాయి. 

 ‘‘పండుగ డిమాండ్‌ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 సంస్కరణ దన్ను భారతీయ ఆటో పరిశ్రమ నవంబర్‌లోనూ అమ్మకాల జోరును కనబరించింది. ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీ వీలర్స్‌ విభాగాలకు సంబంధించి ఈ ఏడాదిలో నవంబర్‌ అత్యధికంగా అమ్ముడైన నెలగా రికార్డు సృష్టించింది. ప్రజారంజకనమైన ప్రభుత్వ సంస్కరణలు, మెరుగుపడుతున్న మార్కెట్‌ సెంటిమెంట్‌తో వచ్చే ఏడాది (2026)లోనూ ఇదే వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది’’ అని సియామ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement