సువర్ణ మాసం
ఇంకో మూడు రోజుల్లో... ‘ఇక సెలవా మరి’ అని నవంబర్ నెల చరిత్రలో కలిసిపోనుంది. అయితేనేం. మహిళల క్రీడా ప్రపంచానికి సంబంధించి ఈ మాసం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోనుంది. మహిళ వన్డే వరల్డ్‌కప్‌ను టీమ్ ఇండియా గెల్చుకోవడం, తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను మన అమ్మాయిలు సాధించడం, భారత మహిళల కబడ్డీ జట్టు వరల్డ్ కప్‌ను చేజిక్కించుకోవడం... ఒకే నెలలో మూడు చారిత్రక విజయాలు. ఇవి గాలివాటు విజయాలు కాదు. ఎన్నో సంవత్సరాల కష్టానికి దక్కిన అపూర్వ ఫలితాలు. ఈ విజయాల్లో నుంచి సిము దాస్‌లాంటి పేదింటి బిడ్డలు ప్రపంచానికి ఘనంగా పరిచయం అయ్యారు...
నవంబర్ 2న నవి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న క్షణం దేశాన్ని ఉత్తేజపరిచింది. ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తినిస్తుంది అన్నట్లుగా ఆ విజయం బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు బలమైన స్ఫూర్తిని ఇచ్చింది.
తొలిసారే...చారిత్రక విజయం!
అంధ మహిళా క్రికెటర్‌ల కోసం క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా(సీఏబీఐ) మొదటిసారిగా టీ 20 వరల్డ్‌కప్‌కు శ్రీకారం చుట్టింది. ఇండియా బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీపిక సారథ్యంలోని జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా విజయం దిశగా దూసుకుపోయింది.
ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం
భారత జట్టులో చోటు సంపాదించడానికి అనేక సవాళ్లను అధిగమించిన అమ్మాయిలు బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీమ్‌లో ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఏళ్లకు ఏళ్లు ప్రాక్టిస్ చేసిన వారు కాదు వారు. గత కొన్ని సంవత్సరాలలో మాత్రమే క్రికెట్ నేర్చుకొని అందులో ప్రావీణ్యం సాధించారు.
మన టీమ్ వరల్డ్ కప్‌ను గెల్చుకోవడం దేశవ్యాప్తంగా ఎంతోమంది దివ్యాంగ మహిళలకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా, ‘మేము సైతం’ అంటూ ఆటల్లో దూసుకుపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
‘దివ్యాంగులు క్రికెట్ లేదా ఇతర క్రీడల్లోకి అడుగు పెట్టడానికి ఈ విజయం స్ఫూర్తిని ఇచ్చింది’ అంటున్నారు మన దేశంలోని అంధుల క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మహంతేష్.
ధైర్యమే వజ్రాయుధమై...
కర్నాటకలోని తుమకూర్‌కు చెందిన దీపిక టీసి చిరునవ్వు లేకుండా మాట్లాడడం అరుదైన దృశ్యం. చిరునవ్వు ఆమె సహజ ఆభరణం. ఆత్మవిశ్వాస సంతకం. ‘నేను బడికి వెళ్లింది క్రికెట్ ఆడడానికి కాదు. అంధత్వంతో కూడా హాయిగా ఎలా జీవించవచ్చో తెలుసుకోవడానికి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది కెప్టెన్ దీపిక. రైతు అయిన ఆమె తండ్రి చిక్కతిమప్ప... ‘ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’ అని చెబుతుండేవాడు.
ఆటలో అది తనకు ఒక మంత్రంలా, వజ్రాయుధంలా పనిచేసింది. జయాపజయాలను అధిగమించేలా చేసింది. ‘బ్లైండ్ క్రికెట్ అనేది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉంటుందనే విషయం నాకు చాలా కాలం వరకు తెలియదు’ అని ఒకప్పుడు చెప్పిన దీపిక టీమ్‌ను విజయపథంలోకి తీసుకువెళ్లి వరల్డ్‌కప్ గెల్చుకోవడంలో కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించింది.
సంజు...స్టార్ రైడర్
రైడర్ స్థానంలో ఉండడమంటే ఆత్మవిశ్వాసంతో ఉండడం, చాలా చురుగ్గా ఉండడం. మెరుపు నిర్ణయాలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడం. ఈ లక్షణాలన్నీ సంజు దేవిలో ఉన్నాయి. అందుకే ఆమె మహిళల కబడ్డీ జట్టులో స్టార్ రైడర్‌గా దూసుకుపోతోంది.
మన టీమ్ మహిళల కబడ్డీ వరల్డ్ కప్‌ను గెల్చుకోవడంలో సంజుదేవి కీలక పాత్ర పోషించింది. ‘కబడ్డీ అమ్మాయిల ఆట కాదు’ అనుకునే ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బ ప్రాంతానికి చెందిన సంజు దేవి స్వరాష్ట్రంలోనే కాదు ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. మహిళల కబడ్డీ వరల్డ్‌కప్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి ఇండియన్ నేషనల్ టీమ్‌కు ఎంపికైన తొలి మహిళగా తన ప్రత్యేకత నిలుపుకుంది సంజుదేవి.
చిన్నప్పటి నుంచే కబడ్డీలో అద్భుత ప్రతిభ చూపేది సంజు. 6వ ఏసియన్ ఉమెన్స్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. బిలాస్‌పూర్‌లోని ఉమెన్స్ రెసిడెన్షియల్ కబడ్డీ అకాడమీలో చేరడం సంజుకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. దిల్ కుమార్ రాథోడ్‌లాంటి కోచ్‌ల దగ్గర కబడ్డీలో పాఠాలు నేర్చుకుంది. ఆ పాఠాలే ఆమె విజయానికి మెట్లు అయ్యాయి.
పేదింటి బిడ్డకు పెద్ద పేరు వచ్చింది
‘మా విజయం ఎంతోమంది అంధ అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తుంది’ అంటుంది అస్సాంకు చెందిన బ్లైండ్ క్రికెటర్ సిము దాస్. ఈ విజేత ఎన్నో కష్టాల రహదారుల్లో నుంచి నడిచి వచ్చింది. ‘బిడ్డ అంధురాలు’ అని తెలుసుకున్న సిము దాస్ తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సిముకు తల్లే అన్నీ అయింది. కొంతకాలానికి తల్లి మంచం పట్టింది. రోజుకు రెండు పూటలా భోజనం కష్టం అయింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడికి నిరంతర సహాయం అవసరం.
ఎన్ని కష్టాలు చుట్టుముట్టినప్పటికీ సిము ఒక కలను నిలబెట్టుకుంది. తాను ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది అసాధ్యం అనిపించే కల. కాని సిము ఎక్కడా వెనకడుగు వేయలేదు. క్రికెట్ తన పాషన్ మాత్రమే కాదు జీవితం అయిపోయింది. క్రికెట్‌పై ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ఆమెకు సలహాలు ఇచ్చేవారు లేరు. ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు లేరు. ఎలా ప్రారంభించాలో, ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. ‘బ్యాటిల్ ఫర్ బ్లైండ్‌నెస్’ సంస్థతో సిముకు అండ దొరికింది.
ఉచిత వసతి, పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం ఆమెకు ఎంతగానో నచ్చింది. ‘నేను క్రికెటర్ కావాలనుకుంటున్నాను’ తన మనసులోని మాటను బలంగా చెప్పింది. ‘మేమున్నాం’ అంటూ సంస్థ ఆమె భుజం తట్టింది. క్రికెట్‌లో శిక్షణ ఇప్పించింది. అంకితభావం, కష్టంతో భారత జట్టులో స్థానం సాధించింది సిము. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబిఐ) భారతదేశం, నేపాల్‌ల మధ్య నిర్వహించిన మహిళా క్రికెట్ సిరీస్‌లో సిము ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది.


