నవంబర్‌లో రూ.1,70,276 కోట్లు
0.7 శాతం వృద్ధికి పరిమితం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం ఏడాది కనిష్టానికి పడిపోయింది. నవంబర్‌లో రూ.1,70,276 కోట్లు జీఎస్‌టీ రూపంలో వసూలైంది. 2024 నవంబర్‌లో ఆదాయం రూ.1.69 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 0.7 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్‌లో మాత్రం స్థూల జీఎస్‌టీ వసూళ్లు అంతక్రితం ఏడాది ఇదే నెలతో (రూ.1.87 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 4.6 శాతం అధికంగా రూ.1.95 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం తెలిసిందే. జీఎస్‌టీలో శ్లాబులను కుదించడంతోపాటు, 375 వరకు ఉత్పత్తులను తక్కువ పన్ను శ్లాబులోకి మార్చడం తెలిసిందే.
కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అక్టోబర్‌లో మెరుగైన ఆదాయానికి పండుగల సమయంలో కొనుగోళ్లు దోహదపడినట్టు, నవంబర్ నెల గణాంకాల్లో రేట్ల సవరణ ప్రభావం కనిపించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్‌టీ వసూళ్లు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 8.9 శాతం పెరిగి రూ.14,75,488 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లు 4 శాతం తగ్గి రూ.18,196 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లను మినహాయించి చూస్తే నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.52 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.


