2025లో జననాలు 79.2 లక్షలే!
2024తో పోలిస్తే 34 లక్షలు తగ్గుదల
17 శాతం పడిపోయిన జననాల రేటు
వరుసగా నాలుగో ఏడాది తగ్గిన జనాభా
బ్యాంకాక్: చైనాలో జనాభా తగ్గుదల క్రమంగా సంక్షోభ స్థాయికి చేరుతోంది. గత ఏడాది కాలంలో దేశంలో జనాభా 33.9 లక్షల మేరకు తగ్గి 140.4 కోట్లకు చేరింది. 2025లో దేశంలో జననాల రేటు ఏకంగా 17 శాతం మేరకు పడిపోయింది. ఇక జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. 2024తో పోలిస్తే 16.2 లక్షల మేరకు తగ్గింది. ఇక 2025లో చైనాలో మరణాల సంఖ్య 1.131 కోట్లుగా నమోదైంది. గత ఐదు దశాబ్దాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం!
చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) సోమవారం విడుదల చేసిన తాజా జనాభా లెక్కల్లో ఈ వివరాలను పొందుపరిచింది. ఆ దేశంలో జననాల సంఖ్యలో తగ్గుదల నమోదవడం ఇది వరుసగా నాలుగో ఏడాది! ఈ పరిణామం షీ జింగ్‌పిన్ సర్కారుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసింది. చైనా దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగడం, 2023లో ఆ స్థానాన్ని భారత్‌కు కోల్పోవడం తెలిసిందే.
పెళ్లీ వద్దు, పిల్లలూ వద్దు!
చైనాలో జనాభా తగ్గుదల సమస్యకు ప్రధాన కారణం పిల్ల్లల్ని కనడం పట్ల చైనీయుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర నిరాసక్తతే. చుక్కలనంటుతున్న జీవన వ్యయం, భరించలేని ఒత్తిళ్ల నడుమ పిల్లల్ని కని పెంచడం తమవల్ల కాదంటూ సగటు చైనీయులు చేతులెత్తేస్తున్నారు. జీవనవ్యయం ఊహాతీతంగా పెరిగిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. యువతీ యువకుల్లో చాలామంది అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు.
వీలైనంత కాలం సింగిల్‌గానే బతుకు బండి లాగించడానికి ఇష్టపడుతున్నారు. దాంతో కొన్నేళ్లుగా చైనాలో పెళ్లిళ్ల సంఖ్యలో కూడా భారీగా తగ్గుదల నమోదవుతోంది. 2024లో దేశవ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్లు కేవలం 61 లక్షలే! 2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గుదల! అంతేకాదు, గత 45 ఏళ్లలో అత్యల్పం కూడా!! దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సంఖ్య గత పదేళ్లుగా తగ్గుతూనే వస్తోంది. అయితే 2025లో మాత్రం చైనాలో పెళ్లిళ్ల సంఖ్య 8.5 శాతం పెరుగుదల నమోదైంది.
పెరుగుతున్న వృద్ధులు
వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం చైనా నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ప్రస్తుతం అక్కడ వృద్ధుల సంఖ్య 32.3 కోట్లు. మొత్తం జనాభాలో ఇది ఏకంగా 23 శాతం! అక్కడ వృద్ధుల సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. అదేసమయంలో పనిచేసే వయసువారి సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. 2035 నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య 40 కోట్లు దాటుతుందని అంచనా. కారి్మకుల లభ్యత భారీగా తగ్గుతుండటంతో రిటైర్మెంట్ వయసును పురుషులకు 60 నుంచి 63 ఏళ్లకు, మహిళలకు 55 నుంచి 58 ఏళ్లకు చైనా పెంచేసింది.
‘పామూ’ కారణమేనా?
చైనాలో జననాలు భారీగా తగ్గడానికి మరో గమ్మత్తైన కారణం కూడా తెరపైకి రావడం విశేషం. అదే... స్నేక్ ఇయర్! చైనా క్యాలెండర్ ప్రకారం 2025 వుడ్ స్నేక్ నామ సంవత్సరం. పాము పేరిట వచ్చే ఏడాది పిల్లల్ని కనేందుకు అస్సలు అనువైనది కాదన్నది చైనీయుల నమ్మకం. ఈ కారణంగా కూడా గతేడాది జననాల రేటు బాగా తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాలో సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టడం వేల ఏళ్లనాటి సంప్రదాయం. 12 ఏళ్లకు 12 జంతువుల పేర్లుంటాయి.
వన్ చైల్డ్ పాలసీ
జనాభా నియంత్రణకు దశాబ్దాల పాటు చైనా అనుసరించిన కఠిన నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితికి మరో ప్రధాన కారణంగా మారాయి. ఒక్కరి కంటే ఎక్కువ మందిన ఇకనేందుకు వీల్లేదన్న నిబంధనను 1980 ఉంచి చైనా అత్యంత కఠినంగా అమలు చేయడం తెలిసిందే. జనాభా తగ్గుదల నేపథ్యంలో పదేళ్ల క్రితం ఈ నిబంధనను ఎత్తేసినా లాభం లేకపోయింది. దంపతులు ఇద్దరు పిల్లల్ని కనొచ్చంటూ 2015లో నిబంధనలను చైనా ప్రభుత్వం సడలించింది.
ఐదేళ్లయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో 2021లో దాన్ని ముగ్గురు పిల్లలకు పెంచింది. అయినా జనం మాత్రం ఎక్కువ మందిని దేవుడెరుగు, ఒక్కర్ని కూడా కనేందుకు ఇష్టపడటం లేదు! ఒక్కో కాన్పుకు 3,600 యువాన్లు (500 డాలర్లు) ఇస్తామన్న ప్రకటన కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అంతేగాక ప్రతి పిల్లాడికీ పెంపకం నిమిత్తం ఏటా 1,534 డాలర్లు ఇస్తామన్నా జనం అంతగా పట్టించుకోలేదు.
ఇలా కాదని ప్రభుత్వం కండోమ్‌ల వాడకాన్ని తగ్గించే చర్యలకు దిగింది. అందులో భాగంగా వాటిపై, గర్భ నిరోధక మాత్రలపై ఎడాపెడా పన్నులు పెంచేసింది. కండోమ్‌లపై అయితే జనవరి 1 నుంచి పన్నులను మరో 13 శాతం పెంచేసింది! అంతేగాక డే కేర్ సెంటర్లు, కేజీ స్కూళ్లకు పలు పన్ను మినహాయింపులు వంటి పలు చర్యలకు కూడా దిగింది. అయినా జనాభా పెరుగుదల విషయంలో ఆశించిన ఫలితాలు పెద్దగా కనిపించడం లేదని తాజా గణాంకాలు మరోసారి తేల్చేశాయి.
ఒక దేశంలో జనాభా పెరగాలంటే మహిళల సగటు సంతాన సాఫల్య రేటు కనీసం 2.1, అంతకు మించి ఉండాలి. కానీ చైనాలో మాత్రం అది 2020 నాటికే ఏకంగా 1.3కి తగ్గిపోయింది! ఇక 2025లోనైతే ఆ దేశంలో జననాల రేటు ప్రతి 1,000 మంది జనాభాకు ఏకంగా 5.63 శాతానికి తగ్గిపోయింది. 1949లో మావో జె డాంగ్ సారథ్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ ఆ దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యల్పం! చైనాతో పాటు తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి పలు తూర్పు ఆసియా దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తూ వస్తోంది!!


