డిసెంబర్‌లో 6 శాతం అధికం
రూ.1.74 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నిత్యావసరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 2025 డిసెంబర్ నెలకు రూ.1.74 లక్షల కోట్లు వసూలైంది. 2024 డిసెంబర్‌లో ఆదాయం రూ.1.64 లక్షల కోట్లు కంటే 6 శాతం పెరిగింది. గత ఏడాది సెపె్టంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్‌టీ రేటు తగ్గించడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులు ఎత్తివేయడం ఫలితంగా వాటి రేట్లు దిగొచ్చాయి. అయినప్పటికీ జీఎస్‌టీ ఆదాయం మెరుగ్గా నమోదవుతుండడం గమనార్హం.
దేశీ ఉత్పత్తులపై ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతి అయిన వస్తువులపై జీఎస్‌టీ రూపంలో ఆదాయం 19.7 శాతం పెరిగి రూ.51,977 కోట్లకు చేరింది. రిఫండ్‌లు సైతం 31 శాతం పెరిగి రూ.28,890 కోట్లుగా ఉన్నాయి.
డిసెంబర్ నెలకు నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. 2024 డిసెంబర్ నెలకంటే 2.2 శాతం పెరిగింది. సెస్సు రూపంలో ఆదాయం రూ.4,238 కోట్లకు పరిమితమైంది. 2024 డిసెంబర్‌లో రూ.12,003 కోట్ల సెస్సు వసూలు కావడం గమనించొచ్చు. సెపె్టంబర్ 22 నుంచి సెస్సు అన్నది కేవలం పొగాకు, వాటి ఉత్పత్తులకే పరిమితం చేయగా, లగ్జరీ వస్తువులపై తొలగించడం తెలిసిందే.


