వైఎస్సార్‌సీపీ హయాంలో ఫోర్టీఫైడ్ గోధుమ పిండి కిలో రూ.16
అధికారంలోకి రాగానే పంపిణీనే నిలిపేసిన చంద్రబాబు సర్కార్
ఇప్పుడు రూ.4 పెంచేసి కొత్తగా ప్రారంభిస్తున్నట్టు కలరింగ్
చంద్రబాబు బినామీ మంత్రి కుటుంబాల కంపెనీలకే ప్యాకింగ్ కాంట్రాక్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులను నిలువునా దోచుకుంటోంది. ఒకవైపు మార్కెట్‌లో నిత్యావసర సరకుల రేట్లు ఆకాశాన్ని తాకుతుంటే చోద్యం చూస్తూ... మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడితప్పింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీని అటకెక్కించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం నాణ్యతకు పాతరేసింది. ఇప్పుడు పండగల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పంపిణీలనే కొత్తగా చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో తొలిసారిగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేయగా... అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు కక్షపూరితంగా నిలిపివేసి... ఏడాదిన్నర తర్వాత రేటు పెంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కిలోకి రూ.4 చొప్పున పెంచేసి...
వైఎస్సార్‌సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతోపాటు ఫోర్టీఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్‌సీఐ నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి, ఫోర్టీఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్‌లో కిలో రూ.16కే లబి్ధదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో రూ.20కి ఇస్తున్నట్టు ప్రకటించి అభాసుపాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్‌ను రూ.27.50కి వినియోగదారులకు ఇస్తే.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కిలో రూ.16కే అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్‌కు ఏకంగా రూ.4 అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది.
అరకొర పంపిణీకే హడావిడి
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నెలకు 1,839 టన్నుల గోధుమలను అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1,690 టన్నుల పిండి వస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లలో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులున్నాయి. వీళ్లందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15 వేల టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తుండడం... అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.
బినామీల కోసమే రేటు పెంచేసి..
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి స్కీము సరికొత్త స్కామ్‌ను తలపిస్తోంది. ఇందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదలట్లేదు. ప్రభుత్వం ఎఫ్‌సీఐ నుంచి కిలో గోధుమలు రూ.6.10కి కొనుగోలు చేస్తోంది. వాటిని మరాడించి... ఆ పిండిని కిలో చొప్పున ప్యాకింగ్ చేసి, ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేర్చి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రూ.20కు ఇస్తోంది. వాస్తవానికి నవంబర్ 5న సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలో గోధుమ పిండిని రూ.18కి ఇస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 24 ఇచ్చిన జీవోలో కిలో గోధుమ పిండి రేటును రూ.20గా పేర్కొంది.
ఇంతలోనే అంత వ్యత్యాసం రావడం వెనుక బినామీలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేవలం రూ.16కు అందించిన గోధుమ పిండి ఇప్పుడు ఏకంగా రూ.20కి చేరుకుంది. అప్పుడు.. ఇప్పుడూ రేషన్ దుకాణ డీలర్ కమిషన్ రూపాయిగానే ఉంది. కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు అప్పగించారు. ఆ ఏజెన్సీ తమ దగ్గర ఎంప్యానల్ అయిన కంపెనీలకు మాత్రమే మిల్లింగ్, ప్యాకింగ్ బాధ్యతలు ఇచ్చింది.
ఇందులో విచిత్రం ఏమంటే.. చంద్రబాబు బినామీ, మంత్రి వియ్యంకుడికి చెందిన కాకినాడ జిల్లాలోని ఓ కంపెనీకి గోధుమ పిండి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు దక్కింది. సదరు కంపెనీ సరఫరా విధానంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని పక్కన పెట్టిన సర్కార్ నోడల్ ఏజెన్సీ ద్వారా అనుకున్నది చేసింది. ఇక్కడ ఎంప్యానల్ చేసిన మిల్లుల కంటే బహిరంగంగా టెండర్ పిలిస్తే పోటీ పెరిగి మిల్లింగ్, ప్యాకింగ్ ధర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు.


