నషాళానికి ధరల కిక్కు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఐఎంఎఫ్ఎల్ కార్టన్ ప్రాథమిక ధరపై కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 12 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ధర రూ. 450–700 ఉన్న కార్టన్‌కు 12 శాతం, రూ. 700–1,000 ఉన్న మద్యానికి 10 శాతం, రూ.1,000 ఆపైన ఉన్న లిక్కర్‌కు 5 శాతం చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆ ప్రకారం చీప్ లిక్కర్ క్వార్టర్‌కు కనిష్టంగా రూ. 6, మీడియం లిక్కర్‌కు రూ. 10 నుంచి రూ. 20 వరకు, ప్రీమియం లిక్కర్ క్వార్టర్‌కు రూ. 70 నుంచి ఆపైన ధరలు పెరిగాయి. పెరిగిన ధరల్లో పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీల యాజమాన్యాలకే ఇవ్వనున్నారు. నేటి నుంచే ధరలు అమల్లోకి వస్తాయని, బీరు ధరలకు ఈ ఉత్తర్వులు వర్తించవని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 12 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెరగటం ఇదే ప్రథమం. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ధరలు స్వల్పం గా పెరిగాయి.
ఐదేళ్లుగా నో టెండర్లు
రాష్ట్రంలో దాదాపు 700 కంపెనీలు మద్యం సర ఫరా చేస్తున్నాయి. రాష్ట్రానికి అవసరమయ్యే మద్యం సరఫరాకు సంబంధించి ఏటా మద్యం కంపెనీలతో ప్రభుత్వం ఒప్పం దం చేసుకుంటుంది. సాధా రణంగా మే నుంచి జూన్ వరకు కాంట్రాక్టు ఒప్పందం గడువు ఉంటుంది. అవస రమైతే గడువును మరో ఏడాది టీఎస్‌బీసీఎల్ పొడిగించవచ్చు.
కానీ వేర్వేరు కారణాలతో ఐదేళ్లుగా ప్రభుత్వం టెండర్లు పిలవడం లేదు. 2011లో కుదిరిన ఒప్పందం 2012 జూన్‌తోనే ముగిసినా పాత ఒప్పందాన్నే ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తోంది. 2012లో ఒప్పందం ముగియగానే మద్యం బేసిక్ ధర పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రం విడిపోయే వరకు ఆ డిమాండ్‌ను అప్పటి సీఎంలు పట్టించుకోలేదు.
కమిటీ ప్రకారమే..
తెలంగాణ ఏర్పాటయ్యాక ధరల పెంపు సాధ్యాసాధ్యా లపై ముగ్గురు సభ్యులతో టెండర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీలకు అదనపు ధర కట్టివ్వొచ్చని అప్పట్లోనే ఆ కమిటీ నివేదికిచ్చింది. కానీ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా అదే నివేదిక ఆధారంగా ధరలు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు చీప్ లిక్కర్ పెట్టెకు (48 క్వార్టర్లు) రూ. 445, మీడియం లిక్కర్ పెట్టెకు రూ. 585, ప్రీమియం పెట్టెకు రూ.1,300 నుంచి రూ. 2,200 చొప్పున డిస్టిలరీల యాజమాన్యాలకు టీఎస్‌బీసీఎల్ చెల్లిస్తోంది. తాజాగా చీప్ లిక్కర్‌కు రూ. 509, మీడియం లిక్కర్‌కు రూ. 655, ప్రీమియం లిక్కర్‌కు రూ. 1,365 నుంచి రూ. 2,310 చొప్పున చెల్లించనుంది.
180 ఎంఎల్ క్వార్టర్‌కు అంచనా పట్టిక
బ్రాండ్ ప్రస్తుత ధర పెరిగిన ధర
రాయల్ గేమ్ 65 70
ఓల్డ్ టవెరన్ 80 90
ఆఫీసర్స్ చాయిస్ 90 100
ఏసీ ప్రీమియం 110 120
ఎంసీ విస్కీ 110 120
ఇంపీరియల్ బ్లూ 110 120
మీడియం లిక్కర్
రాయల్ స్టాగ్ 150 165
రాయల్ చాలెంజ్ 210 220
ప్రీమియం లిక్కర్
బ్లెండర్స్ ప్రైడ్ 240 260
సిగ్నేచర్ 250 275
100 పైపర్స్ 410 480