
ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకునే వెలుగుల పండగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఇందులో ఒకటి అన్నా చెల్లెళ్ల పండగ ‘భగినీహస్త భోజనం’. అదే బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియతో ముగుస్తాయి. అసలేంటీ భగినీహస్త భోజనం తెలుసుకుందాం.
భగినీ హస్త భోజనం లేదా భాయ్ ధూజ్
సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.
"భాయ్ ధూజ్'' అనే పేరుతో నార్త్ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందింది. మన పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. ఇద్దరూ చాలా సంతోషంగా గడుపుతారు. ఈ సంతోషంలో అన్నయ్యను ఒక కోరిక కోరుతుంది సోదరి. అక్కాచెల్లెలు చేతితో అన్నం తింటే వదిలిపెట్టు అన్నయ్యా కోరుకున్నదట ఆమె. దీనికి ఎంతో సంతోషించిన యమధర్మరాజు కార్తీకమాస శుక్ల పక్ష విదియనాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలింటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా ఉంటుందని అనుగ్రహించాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. అలా ఈ రోజు తమ సోదరి చేతి భోజనం చేయడం వలన అప మృత్యు భయం తొలగిపోతుందని ఓ నమ్మకం. ఈ రోజున తన సోదరుడిని గౌరవంగా చూసుకునే ఏ సోదరి అయినా ఎల్లకాలం సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటుందని చెప్పాడు. అందుకే దీనిని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. ఎక్కడున్నా ఈ రోజు కచ్చితంగా అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు.
ఈ ఏడాది స్పెషల్ : ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు, ఆనంద , శ్రేయస్సు కోసం యముడిని పూజించడం ద్వారా, వారి నుదుటిపై తిలకం (చంద్రుని గుర్తు) పూయడం ద్వారా, పవిత్ర తోరం (రక్షా సూత్రం) కట్టడం ద్వారా ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులపై ఆప్యాయత, బహుమతులను కురిపిస్తారు. ఈ సంవత్సరం, ఆయుష్మాన్ యోగా , శివవాస యోగా అనే రెండు శుభ సంయోగాలు ఒకేసారి సంభవించడం వల్ల భాయ్ దూజ్ ప్రాముఖ్యత పెరిగింది.
ముహూర్తం : 2025 భాయ్ దూజ్ పంచాంగం ప్రకారం, కార్తీక శుక్ల ద్వితీయ తిథి అక్టోబర్ 23 రాత్రి 10:46 గంటల వరకు ఉంటుంది. తిలకం, పూజకు అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 1:13 నుండి మధ్యాహ్నం 3:28 వరకు ఉంటుంది.