బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ దీపావళి కానుక ఇపుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది. సిబ్బందికి దివాలీ కానుకకు సంబంధించిన వీడియో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది బిగ్‌బీ దివాలీ గిఫ్ట్‌కు మెచ్చుకోగా, మరికొందరు ఆయన కానుకపై నిరాశగా పెదవి విరిచారు. సిగ్గు చేటు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే...
బిగ్‌బీ తన సిబ్బందికి దీపావళి కానుకగా రూ.10,000 నగదు, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారంటూ ముంబైలోని అమితాబ్ నివాసం జుహూ వద్ద ఒక కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలీవుడ్ అతిపెద్ద నటుడు అమితాబ్ బచ్చన్ తన ఇంటి సిబ్బందికి ,భద్రతా సిబ్బందికి రూ. 10,000 నగదు , ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోనే షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ఈ వీడియో వేలాది వీక్షణలతోపాటు నెటిజన్లలో చర్చకు దారితీసింది. పండుగ సీజన్‌లో తన ఉద్యోగులను ప్రశంసించినందుకు కొందరు అమితాబ్‌ను ప్రశంసించారు.
మరికొందరు బిగ్‌బి లాంటి వాళ్ల స్థాయికి, ఆస్తులతోపోలిస్తే ఇది "చాలా తక్కువ" ,"ఇది చాలా విచారకరం అనే విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరైతే, రోజంతా మీ భద్రకోసం, మీకోసం కాపలాకాసే వారికి కేవల 10వేల రూపాయలా, సిగ్గు చేటు, దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి రెట్టింపు జీతం ఇవ్వాలి. కొంతమంది 20-25 వేలు బోనస్‌గా కూడా ఇస్తారు" అంటూ స్పందించారు. పలు కంపెనీలు, కార్పొరేట్లు తమ కార్మికులకు లగ్జరీ దీపావళి కానుకలు, హ్యాంపర్లు బహుమతిగా ఇస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయిన సమయంలో ఈ ట్రోలింగ్ విపరీతంగా నడుస్తోంది.
నోట్: ఈ వీడియోలో అమితాబ్ క్లిప్‌లో పలువురు సిబ్బంది, భద్రతా సిబ్బంది బహుమతులు అందుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు.


