పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలు ఎన్నో కొంగొత్త విషయాలకు లేదా పురాతన చరిత్రకు ఆలవాలం. మధ్యయుగ కాలంలో మనుషులు ఇలా ఉండేవారని వాటి ఆనవాళ్లు, గుర్తులు ఉపయోగించిన పరికరాలతో అంచానా వచ్చేవాళ్లం. కానీ ఆ విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచి మన పరిశోధకులుకు అందించి విస్మయపరిచాయి ఈ రాబందుల గూళ్లు. అవన్ని ఎలా పాడవ్వకుండా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నది పరిశోధకులకు ఊహకందని మిస్టరీలా మారింది.
దక్షిణ స్పెయిన్‌లో ఒక గుహలో శతాబ్దాల నాటి రాబందుల గూళ్లు పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తించాయి. ఆ పర్వత గుహల్లో రాబందులు లోతైన భారీగూళ్లను నిర్మించడమే ఇందుకు కారణం. నిజానికి ఇవి మనం చూసే రాబందులుకు కాస్త భిన్నంగా గడ్డంతో ఉంటాయి. అలాగే వేటాడటంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అంతేగాదు ఆగూళ్లు పదిలంగా ఉండేలా..తాజా కొమ్మలు, ఉన్ని, ఎముకలు, ఇతర పదార్థాలను జోడించి మరి అందంగా నిర్మించాయి.
దాంతో ఆ భారీ గూళ్లలో ఏ వస్తువు దాచినా భద్రంగా ఉంటాయట. అయితే ఈ గూళ్లను పురావస్తు పరిశోధకులు 2008, 2014 మధ్య కాలంలో గుర్తించి తవ్వడం ప్రారంభించారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఈ జాతులు సుమారు 70-130 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాయి. కానీ అవి వదిలి వెళ్లిన ఈ గూళ్ల కారణంగా నాటి చరిత్రకు ఆధారాలు లభించినట్లయ్యిందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ గూళ్లలో వేలాది జంతువుల ఎముకల తోపాటు 200 కి పైగా మానవ నిర్మిత కళాఖండాలను పరిశోధకులు గుర్తించారు.
వాటిలో శాస్త్రవేత్తలను అత్యంత అమిత ఆశ్చర్యానికి గురిచేసింది మాత్రం దాదాపు 650-750 సంవత్సరాల క్రితం తయారు చేసిన చెప్పులు. అవి ఇప్పటికీ పాడవ్వకుండా ఉండటం చాలా మిస్టరీగా అనిపించింది పరిశోధకులకు. అందులోనే పెయింటింగ్ వేసిన గొర్రె చర్మపు తోలు, గుడ్డ ముక్కలు, గడ్డితో నేసిన పనిముట్లు, మధ్యయుగ క్రాస్‌బౌ బోల్ట్ తదితరాలను గుర్తించారు. ఈ పక్షులకు వేటాడటంలో ప్రత్యేకతతోపాటు ఎముకలను పగలు కొట్టి వాటి మజ్జను తినడంలో స్పెషలిస్ట్‌లట.
ఈ గూళ్లను చూస్తే సహజ మ్యూజియంలా అనిపిస్తున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే..మధ్యయుగం నాటి పర్యావరణ వ్యవస్థలు, పక్షి ఆహారం, అలాగే ఆ కాలంలోని మానవ కార్యకలాపాలపై అసామాన్యమైన అంతర్దృష్టిని అందించాయని చెప్పారు.
ప్రస్తుతం దక్షిణ స్పెయిన్‌లో రాబందులు కనుమరుగైనప్పటికీ..వాటి గూళ్లు పరిశోధనలకు, అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు గొప్ప మార్గాన్ని అందించాయని అన్నారు. ఈ గడ్డం రాబందులు ఈ వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లి..ఒకరకంగా నాటి మానవజీవితంపై ఒక ఆలోచనను అందించాయని అన్నారు. కాగా, ఈ పరిశోధన ఇటీవల ఎకాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.
(చదవండి: రూ.1.3 కోట్ల ఉద్యోగ ఆఫర్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..ఏకంగా ఆరు నెలలు..)


