బొలోగ్నా (ఇటలీ): పురుషుల టెన్నిస్ ప్రపంచకప్ టోర్నమెంట్ ‘డేవిస్ కప్’లో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. స్టార్ ప్లేయర్ జానిక్ సినెర్ బరిలోకి దిగకుండగానే ఇటలీ జట్టు వరుసగా మూడో సారి డేవిస్ కప్ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో స్పెయిన్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో మాటియో బెర్‌టిని, ఫ్రావియో కొబొలి విజయాలు సాధించడంతో డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకుండానే ఇటలీ విజయం సాధించింది.
ఇటలీ జట్టు డేవిస్ కప్ కైవసం చేసుకోవడం ఓవరాల్‌గా ఇది నాలుగోసారి కాగా... వరుసగా మూడోసారి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్‌లో చివరగా అమెరికా జట్టు 1968 నుంచి 1972 వరకు వరుసగా ఐదు సార్లు చాంపియన్‌గా నిలవగా... ఆ తర్వాత మరే జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేయలేదు. గత రెండు సంవత్సరాలు ఇటలీ జట్టు డేవిస్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ ఈ సారి బరిలోకి దిగకపోయినా... బెర్‌టిని, కొబొలి చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు విజయం సాధించింది.
తొలి సింగిల్స్ మ్యాచ్‌లో బెర్‌టిని 6–3, 6–4తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై విజయం సాధించగా... రెండో సింగిల్స్ పోరులో కొబొలి 1–6, 7–6 (7/5), 7–5తో జామె మునార్ (స్పెయిన్)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియాపై 2–0తో విజయం సాధించిన ఇటలీ... సెమీఫైనల్లో బెల్జియంపై కూడా 2–0తో గెలుపొందింది. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ లేకుండానే స్పెయిన్ బరిలోకి దిగింది. 2019 తర్వాత తొలిసారి ఫైనల్ ఆడిన ఆరుసార్లు చాంపియన్ స్పెయిన్ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.


