క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. చాలా ప్రాంతాల్లో చర్చిలను రంగు రంగుల నక్షత్రాలతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు జరపడం మామూలే! కొన్ని చోట్ల మాత్రం ప్రత్యేక సంప్రదాయాలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకొంటారు. కొన్ని చోట్ల ఈ వేడుకలు న్యూఇయర్ వరకు, ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఏకబిగిన కొనసాగుతాయి. అలాంటి అరుదైన వేడుకే ముగ్గురు రాజుల జాతర. దీనినే ‘త్రీ కింగ్స్ పరేడ్’ అంటారు.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరం సహా స్పెయిన్‌లోని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఏటా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈ ‘త్రీ కింగ్స్ పరేడ్’ కూడా జరుగుతుంది. దీనినే ‘కావల్‌కేడ్ మాగి’ అని, ‘త్రీ మాగి పరేడ్’ అని కూడా అంటారు. ఈ పరేడ్ ఏటా జనవరి 5న జరుగుతుంది. ‘త్రీ కింగ్స్ పరేడ్’ జరిగే రోజున స్పెయిన్‌లోని ప్రతి ఊరూ ఒక బహిరంగ రంగస్థలంలా మారిపోతుంది. బైబిల్‌లో ప్రస్తావించిన ముగ్గురు జ్ఞానుల వేషధారులను వాహనాలపై నిలిపి, అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుపుతారు. ఊరూరా జరిగే ఈ ఊరేగింపుల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ముఖ్యంగా మాడ్రిడ్‌లో జరిగే ఈ ‘త్రీ కింగ్స్ పరేడ్’ను తిలకించడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
ఏసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు వైపు నుంచి ముగ్గురు జ్ఞానులు ఒంటెలపై వచ్చినట్లు బైబిల్ కథనం. వీరు క్రీస్తును వెదుకులాడుతూ ఇల్లిల్లూ గాలిస్తూ, పిల్లలు ఉన్న ఇళ్లలో రకరకాల కానుకలను విడిచి వెళ్లారట! బైబిల్‌లో ప్రస్తావించిన ఈ గాథను స్పానిష్ ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అందువల్ల క్రిస్మస్ రోజుల్లో ఇళ్లలోని పిల్లలు క్రిస్మస్ చెట్ల పక్కనే, శుభ్రం చేసిన పాదరక్షలను ఉంచి, త్వరగానే నిద్రపోవడానికి పక్కల మీదకు చేరుకుంటారు.
త్వరగా నిద్రపోతే తాము నిద్రపోతున్నప్పుడు ఇళ్లకు వచ్చే జ్ఞానులు తమ కోసం కానుకలను విడిచిపెట్టి వెళతారని స్పానిష్ పిల్లల నమ్మకం. స్పెయిన్‌లో జరిగే ‘త్రీ కింగ్స్ పరేడ్’లో జ్ఞానుల వేషాలు ధరించి పాల్గొనేవారు పిల్లలకు మిఠాయిలు, ఆటబొమ్మలు వంటివి కానుకలుగా పంచిపెడతారు. ఊరంతా కోలాహలం ఆటపాటలతో సాగే ఈ ఊరేగింపు జనవరి 5న సాయంత్రానికి ముందు మొదలై, జనవరి 6 వేకువజామున ముగుస్తుంది. స్పెయిన్‌లో ఈ ఊరేగింపు జరిపే సంప్రదాయం పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధం నుంచి కొనసాగుతోంది.


