స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పిన ఓ హైస్పీడ్ రైలు.. మరో రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో వంద మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుపై స్పెయిన్ ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
సౌత్ స్పెయిన్‌లోని అడముజ్ సమీపంలోని ఆండలూసియా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. మాలాగా–మాడ్రిడ్ మధ్య నడిచే హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి.. ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఆ ధాటికి బోగీలు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. ఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి.. సైనికుల సాయంతో గాయపడ్డ వారిని బయటకు తీసి సమీప స్టేషన్లు మాడ్రిడ్, సెవిల్లే, కార్డోబా, మాలాగా, హువెల్వా స్టేషన్లలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు తరలించింది. గాయపడ్డ వాళ్లలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో హైస్పీడ్ రైలులో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చని ఎమర్జెన్సీ వింగ్ ఆఫీసర్ ఆంటోనియో సాంజ్ తెలిపారు. ఘటనపై ప్రధాని పెడ్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దేశానికి బాధాకరమైన రాత్రి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనపై రాజు ఫిలిప్ VI, రాణి లెటిజియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విచిత్రమైన రైలు ప్రమాదం
ప్రత్యక్ష సాక్షులు ఈ రైలు ప్రమాదాన్ని.. హారర్ సినిమాను తలపించిందని చెబుతున్నారు. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ అంతా చీకటి. ఈలోపు మరో రైలు ఢీ కొట్టింది. గాజు ముక్కలు గుచ్చుకునే చాలామంది గాయపడ్డారు అని గాయపడ్డ పలువురు తెలిపారు.
ఈ రైలు ప్రమాదాన్ని అత్యంత విచిత్రమైన ప్రమాదంగా స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే ట్రాక్‌పై ఎక్కడా పట్టాలు దెబ్బ తినలేదు. పైగా అది సూటి మార్గం కూడా. అలాగే ప్రయాణించిన రైలు కూడా కొత్తదే. అయినా ప్రమాదం జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటోంది. ‘‘సాధారణంగా ట్రాక్‌ల్లో మలుపు ఉండడం, రైలు పాతది కావడం లేదంటో నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఈ ప్రమాదం ఆశ్చర్యం కలిగిస్తోంది. కుట్ర కోణం ఏదైనా ఉందా? అనేది సమగ్ర దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తాం’’ అని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటే అన్నారు.
యూరప్‌లోకెళ్లా అతిపెద్ద హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ కలిగిన దేశం స్పెయిన్. దాదాపు 3,000 కిలోమీటర్లకు పైగా ఈ నెట్‌వర్క్ విస్తరించింది ఉంది. 1944లో స్పెయిన్‌లో జరిగిన టోర్రే డెల్ బియెర్జో (Torre del Bierzo) ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 2013లో సాంటియాగో డి కంపోస్టెలా వద్ద జరిగిన ప్రమాదంలో 80 మంది మృతి చెందారు.


