స్పెయిన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 122 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న ఒక హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. 2013 తర్వాత దేశంలో జరిగిన అత్యంత భయానక రైలు ప్రమాదమిది.
ట్రాక్ లోపమే కారణమా?
దర్యాప్తులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌లపై ఉన్న ఫిష్ ప్లేట్ (రైలు పట్టాల విభాగాలను కలిపే జాయింట్) తీవ్రంగా అరిగిపోయినట్టు సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ లోపం కొంతకాలంగా ఉన్నట్టు, దాని కారణంగా రైలు పట్టాల మధ్య ఖాళీ పెరిగినట్టు అధికారులు తెలిపారు.
దర్యాప్తు ప్రకారం.. రైలులో ముందున్న కోచ్‌లు ఆ ఖాళీ గుండా సురక్షితంగా వెళ్లాయి. అయితే ఎనిమిదవ (చివరి) కోచ్ పట్టాలు తప్పడంతో, దాని ముందు ఉన్న ఏడవ, ఆరో కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. దీంతో రైలు పూర్తిగా అదుపు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం మాడ్రిడ్‌కు దక్షిణంగా 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్డోబా ప్రావిన్స్‌లోని అడముజ్ సమీపంలో సాయంత్రం 7.45 గంటల సమయంలో జరిగింది. గాయపడిన వారిలో 48 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 12 మంది ఐసీయూలో ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్ – దక్షిణ అండలూసియా మధ్య నడిచే 200కు పైగా రైళ్లను సోమవారం రద్దు చేశారు.


