ముందుంది ‘యుద్ధ గండం’.. ట్రంప్‌నకు భారీ షాక్‌? | Iran war is not ending soon says Donald Trump | Sakshi
Sakshi News home page

ముందుంది ‘యుద్ధ గండం’.. ట్రంప్‌నకు భారీ షాక్‌?

Mar 7 2026 6:41 AM | Updated on Mar 7 2026 11:58 AM

Iran war is not ending soon says Donald Trump

ఇరాన్‌ యుద్ధం సెపె్టంబర్‌ దాకా కొనసాగే అవకాశం  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై స్వదేశంలో మొదలైన అసంతృప్తి  

మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో చేదు ఫలితాలు వస్తే ఆయన దిగిపోక తప్పదంటున్న విశ్లేషకులు  

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించి వారం రోజులవుతోంది. ఈ యుద్ధం పశ్చిమాసియాలో తొమ్మిది దేశాలకు విస్తరించింది. ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌ సైన్యం ఎక్కడా తగ్గకుండా శక్తిమేరకు పోరాడుతోంది. ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలకే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఈ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సొంతదేశంలో అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. 

ఈ ఘర్షణను త్వరగా ముగించకపోతే మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని, చివరకు ట్రంప్‌కు పదవీ గండం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఇరాన్‌ను ఎలాగైనా లొంగదీసుకోవడానికి అమెరికా సైన్యం వనరుల సమకూర్చుకుంటోంది. తమ సైన్యాన్ని, ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ యుద్ధం మరో ఆరు నెలలకుపైగానే.. అంటే సెపె్టంబర్‌ దాకా కొనసాగే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ మరణిస్తే యుద్ధం ముగిసిపోతుందని, ఇరాన్‌ తలవంచడం ఖాయమని, అక్కడ ప్రభుత్వం మారిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భావించాయి. కానీ, క్షేత్రస్థాయిలో జరుగున్నది మరొకటి. ఖమేనీ హత్యపట్ల ఇరాన్‌ ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా వారంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు.   

ముందస్తు ప్రణాళిక లేని యుద్ధం  
సుదీర్ఘ యుద్ధానికి ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా సైతం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఇరాన్‌లో నిఘా కార్యకలాపాలు ముమ్మరం చేస్తోంది. అదనంగా మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులను ఫ్లోరిడాలోని తమ ప్రధాన కార్యాలయానికి పంపించాలని పెంటగాన్‌కు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ విజ్ఞప్తి చేసింది. మరోవైపు రష్యా నుంచి 30 రోజులపాటు చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్‌కు అమెరికా తాత్కాలికంగా మినహాయింపు ఇచి్చంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా రోజులు పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికతో జరిగే యుద్ధాలు కొన్ని నెలలపాటు కొనసాగుతుంటాయి. ఇరాన్‌లో యుద్ధానికి అప్పటికప్పుడు ప్రణాళిక తయారుచేశారు. ముందస్తు సన్నద్ధత అంటూ ఏదీ లేదు. అందుకే ఇది ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేని పరిస్థితి. 

ట్రంప్‌కు నష్టమెందుకు?  
అమెరికాలో నవంబర్‌లో మిడ్‌టర్మ్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది. ట్రంప్‌ రెండేళ్ల పాలన పూర్తి కావడానికి ముందు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇరాన్‌ యుద్ధం ఈ ఎన్నికలపై గట్టి ప్రభావం చూపడం తథ్యమని అంటున్నారు. ట్రంప్‌ అనవసరంగా ఈ యుద్ధం తెచి్చపెట్టారన్న అభిప్రాయం అమెరికాలో వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో మరో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని అంటున్నారు. వీరిలో ట్రంప్‌ సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు. రిపబ్లికన్‌ పారీ్టలో చీలిక కనిపిస్తోంది. ట్రంప్‌ను వ్యతిరేకించేవారు ఎక్కువవుతున్నారు. తన మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అండతోనే ఇరాన్‌పై దాడులు ఆరంభించామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు.

 తద్వారా ట్రంప్‌ పోద్బలంతోనే ఇరాన్‌లో నిప్పుల కుంపటి రగించారని అమెరికన్లు నిర్ణయానికొచ్చారు. అసలు ఖమేనీని హత్య చేయడం వెనుక ఔచిత్యం ఏమిటని ప్రశి్నస్తున్నారు. గత అమెరికన్‌ అధ్యక్షులు ఇరాన్‌పై యుద్ధానికి ఇష్టపడలేదు. ఆ పని మొదట తానే చేశానని ట్రంప్‌ గొప్పగా చెప్పుకోవడం ప్రజలకు రుచించడం లేదు. యుద్ధ ప్రభావం ఇప్పటికే మొదలైంది. ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నాయి. ఇవన్నీ ట్రంప్‌కు సవాలుగా మారుతున్నాయి. మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు లభిస్తే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ తప్పుకోవాలన్న డిమాండ్లు సొంత పారీ్టలోనే ఊపందుకోవచ్చు. అది ప్రజా ఉద్యమంగా మారితే ట్రంప్‌ మధ్యలోనే దిగిపోక తప్పదని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement